అటు ఈడీ ఇటు సిబిఐ.. టీఆర్‌ఎస్‌లో ఆందోళన

By KTV Telugu On 3 December, 2022
image

ఎమ్మెల్సీ కవితకు సి.బి.ఐ నోటీసులు
హైదరాబాద్‌లోని కవిత ఇంట్లోనే విచారణ

ఇటు టీఆర్‌ఎస్‌… అటు బీజేపీ.. మధ్యలో దర్యాప్తు సంస్థలు. ఇది ఇప్పుడు తెలంగాణలో నెలకొని ఉన్న విచిత్రమైన పరిస్థితి. ఈ రెండు పార్టీల రాజకీయ వైరం మధ్య మూడు నోటీసులు ఆరు కేసులు అన్నట్లుగా సాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను అరెస్టు చేశారు. బీజేపీ కీలక నేత బి.ఎల్‌. సంతోష్‌, జగ్గూస్వామి, తుషార్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇది ఇట్లా ఉంటే అటు టీఆర్‌ఎస్‌ మంత్రుల ఇళ్లపై ఐటీ అధికారులు, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి గంగుల, ఎం.పి వద్దిరాజు ఇళ్లపై ఈడీ అధికారులు తనికీలు నిర్వహించారు. క్యాసినో వ్యవహారంపై మంత్రి తలసాని పి.ఎ సోదరులను విచారించారు. రీసెంట్‌గా మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై మూడు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతం మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఐటీ అధికారలు విచారిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిబిఐతో పాటు ఈడీ కూడా విచారణ జరుపుతోంది. రీసెంట్‌గా డిల్లీ సెషన్స్‌ కోర్టుకు సమర్పించిన అమిత్‌ ఆరోరా రిమాండ్‌ రిపోర్టులో కవిత ప్రస్తావన గురించి ఈడీ చాలా స్పష్టంగా పేర్కొంది. సౌత్‌ గ్రూపును నియంత్రిస్తున్న ముగ్గురిలో కవిత కూడా ఒకరు అని ఆ రిపోర్టులో ఉంది. ఒక సంవత్సరంలో ఆమె పది ఫోన్లు మార్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ఉందని తెలియగానే టీఆర్‌ఎస్‌ శ్రేణులు అలర్ట్‌ అయ్యాయి. ఇదంతా రాజకీయ కుట్ర అని మండిపడ్డారు కవిత. ఈడీ, మోడీలకు తాము భయపడబోమని అరెస్టు చేస్తే చేసుకోండని సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సి.బి.ఐ నుంచి పిలుపొచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ కోసం సీఆర్‌పీసీ 160 కింద కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఎక్కడైనా విచారణకు హాజరుకావొచ్చని ఆ నోటీసుల్లో సూచించారు అధికారులు. అయితే తాను డిసెంబర్‌ 6న విచారణకు తన ఇంట్లోనే విచారణ చేసుకోవచ్చని కవిత తెలిపారు. ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశాలపై కవితను ప్రశ్నించనున్నారు. తనకు సీబీఐ ఇచ్చిన నోటీసుల విషయమై సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశం అయ్యారు. ఏదైనా కేసు దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించిన వివరాలు తెలిసి ఉంటాయని భావించినప్పుడు సదరు వ్యక్తులకు 160 సి.ఆర్‌.పి.సి కింద అధికారులు నోటీసులు జారీ చేస్తారు. కేవలం సమాచారం కోసమే నోటీసులు ఇచ్చారని అరెస్టు చేయబోరని న్యాయనిపుణులు చెబుతున్నారు.