టార్గెట్ హాస్పిటల్స్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటేనే ప్రతీకారదాడులు చేసే దర్యాప్తుసంస్థగా ముద్రపడింది. ప్రత్యర్థిపార్టీల నేతలకు చెక్ పెట్టాలంటే ఈడీ రంగంలోకి దిగుతుందనే అభిప్రాయం ఉంది. దేశంలో ఎంతోమంది ప్రతిపక్ష నేతలకు ఈడీ దాడుల అనుభవం ఎదురవుతోంది. మొన్నటిదాకా తెలంగాణలో దాడులతో హడలెత్తించిన ఈడీ ఇప్పుడు ఏపీపై కన్నేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈడీ టార్గెట్ రాజకీయ నేతలు కాకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. విజయవాడ ఎన్నారై హాస్పిటల్లో ఈడీ సోదాలు వ్యాపారవర్గాల్లో కలకలం రేపాయి.
ఎన్నారై ఆసుపత్రితో పాటు మరికొన్ని హాస్పిటళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. ఎన్ఆర్ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలోనూ ఈడీ తనిఖీలు నిర్వహించింది. హాస్పిటల్ ఛైర్మన్‌తో పాటు సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కినేని మణి అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తూ విజయవాడలో హాస్పిటల్ ప్రారంభించారు. విదేశీ నిధుల అక్రమ మళ్లింపు అభియోగాలతో ఈడీ దాడులు చేసినట్లు సమాచారం. సొసైటీల చట్టం కింద ఏర్పాటైన ఆసుపత్రి నిర్వహణలో ఎన్నో లోపాలను ఈడీ గుర్తించింది. సొసైటీ సభ్యత్వాలను కోట్లకు అమ్ముకున్నారనే ఆరోపణలపై కూపీలాగుతోంది.
మరోవైపు విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో భారీగా అవకతవకలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. కోవిడ్ సమయంలో అక్రమాలతో ఈ ఆస్పత్రిపై ఇదివరకే కేసు నమోదైంది. మాన్యువల్, నకిలీ రసీదులతో నిధులు దారి మళ్లించారనే ఆరోపణలొచ్చాయి. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషెంట్ల వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. కొందరు ఉద్యోగుల సహకారంతో బినామీ ఖాతాలకు నగదు మళ్లింపుతో పాటు, పరికరాల కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ లోతుగా ఎంక్వయిరీ చేస్తోంది. ఇదివరకు ఐటీ ఒక్కటే. ఇప్పుడు ఈడీ కూడా నిఘా పెట్టటంతో బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.