ఆ విషయంలో కవిత గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే!

By KTV Telugu On 3 December, 2022
image

ఆ ముచ్చట కూడా తీరింది.. కేసీఆర్‌ బిడ్డకి కష్టకాలం

ఎంతయినా కేసీఆర్‌ బిడ్డ. తగ్గేదేలే.. కిందపడ్డా తమదే పైచేయి అని దబాయించగలరు. ఎదుటివాళ్లతో అవునని అనిపించగలరు. లిక్కర్‌ స్కామ్‌లో కవిత పేరు ఎప్పట్నించో వినిపిస్తున్నా తాజాగా సీబీఐ నోటీసులతో మ్యాటర్‌ అఫీషియల్‌గా కన్‌ఫం అయినట్లయింది. అబ్బే ఎంక్వయిరీకి కాదు జస్ట్‌ వివరణకోసమేనని గులాబీ గ్యాంగ్‌ కవరింగ్ ఇస్తోంది. సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద ఇచ్చే నోటీసులు టెక్నికల్‌గా సమన్ల కిందికి రావు. అదే సమయంలో ఆ సెక్షన్‌ కింద నోటీసులు అందుకున్న వారిని సాక్షిగా కూడా పరిగణించలేం. మరయితే సీబీఐ కవితకు ఈ నోటీసు ఎందుకిచ్చినట్లు? సరదాగా కాసేపు బతుకమ్మ విశేషాలు తెలుసుకుందామనా? ఆమె భవిష్యత్తు ఆలోచనలు పంచుకోడానికా?

లిక్కర్‌స్కామ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురి పేరు తెరపైకొచ్చే అవకాశమే లేదు. కేసులో కీలక నిందితుడి రిమాండ్‌ రిపోర్ట్‌లో పేరు ప్రస్తావించారంటేనే అనుమానించదగ్గ ఆధారాలు దర్యాప్తుసంస్థ దగ్గర ఉన్నాయని. సరే ఆ ఆధారాలు నేరుగా ఆమె పేరుని నిందితుల జాబితాలో చేర్చేంత బలంగా ఉన్నాయా లేదా అన్నది తర్వాత. లిక్కర్‌స్కామ్‌కి ఓ దారిచూపించిన సౌత్‌గ్రూప్‌లో కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారనేది నిస్సందేహం. అయితే బీజేపీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌లా కవిత డిఫెన్స్‌లో పడలేదు. కోర్టును ఆశ్రయిస్తానని అనలేదు. విచారణకు సిద్ధమవుతున్నారు. డిసెంబరు6న తన ఇంట్లోనే వివరణ ఇస్తానంటున్నారు. ఈ విషయంలో ఆమె తెగువని ప్రశంసించాల్సిందే.

అయితే ఇక్కడే మరో ట్విస్టుంది. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది తెలంగాణ సర్కారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో విచారణకు సీబీఐ ఎలా వస్తుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఫాంహౌస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌తో తమను ఇరికించిన కేసీఆర్‌కి లిక్కర్‌స్కామ్‌తో గట్టి కౌంటర్‌ పడిందని కమలం పార్టీ సంబరపడుతోంది. రాజకీయ మాయలపకీరు ప్రాణం తమ చేతికి చిక్కిందనుకుంటోంది. మునుగోడు గెలుపు తర్వాత బీఆర్‌ఎస్‌తో బీజేపీకి కంట్లో నలుసులా మారాలనుకున్నారు కేసీఆర్‌. కానీ లిక్కర్‌స్కామ్‌ ఆయన ముందరికాళ్లకు బంధాలేసేలా ఉంది. కేసీఆర్‌ కదలికలను బట్టి కవిత మెడకు లిక్కర్‌స్కామ్‌ బిగుసుకునేలా ఉంది. కవితకి నోటీసులతోనే ఆగేలా లేదు మ్యారట్‌. కేసీఆర్‌ ఫ్యామిలీ ఆస్తులమీద విచారణకు ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కేంద్ర దర్యాప్తుసంస్థలు రంగంలోకి దిగే రోజు ఎంతో దూరంలో లేదు.