ప్రపంచానికి మాంద్యం ముంచుకొస్తోందా ? అమెరికా నుంచి ఘానా వరకు అన్ని దేశాలు మునిగిపోవడం ఖాయమా ? ఈ మందగమనాన్ని తట్టుకునేందుకు ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి ? ఇండియాకు ముప్పు పొంచి ఉందా ? భారతీయులు చేయాల్సిదేమిటి ?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే ప్రమాదం
అగ్రరాజ్యాలను వేధించబోతున్న మాంద్యం
అమెరికాలో 2023 గడ్డుకాలం
ఇప్పుడే మొదలైన మాంద్యం ప్రభావం
యూకేలో టక్నికల్ రిసెషన్
రెండేళ్లు దుర్భర పరిస్థితి తప్పదంటున్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్
పాకిస్థాన్, శ్రీలంక సహా 15 దేశాలకు అథోగతి
పెరుగుతున్న జీవన వ్యయం, తగ్గుతున్న ఆదాయాలు
ఇండియాకు మాంద్యం ముప్పు లేదంటున్న ఆర్థికవేత్తలు
భారత్ కు వరంగా పరిణమించిన యువజనాభా
ఆర్థికాంశాల్లో భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అనివార్యత
పండుగలకు వృథా వ్యయం తగ్గించుకుంటే మంచిది
క్రిస్మస్ సీజన్ కు రెడీ అవుతున్నారా కేకులు కొందామనుకుంటున్నారా సంక్రాంతికి కుటుంబమంతా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అరిసెలు, సకినాలు, కొత్త బట్టలు, వినియోగ వస్తువులు అంటూ లెక్కలేసుకుంటున్నారా అయ్యో ఆగండాగండి అంత తొందరెందుకండీ రేట్లు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుందా మొత్తం ఇప్పుడే ఖర్చు పెడితే భవిష్యత్తుకు మిగిలేదేమిటో ఆలోచించారా రూపాయి వస్తువు పది రూపాయలకు కొనాల్సి వస్తోందని గుర్తించారా లేదా మరి అదే ఆర్థిక మాంద్యం అంటే. ప్రపంచ దేశాల్లో వినియోగదారులను వణికిస్తున్న ధరల ప్రభావం కూడా అదే మరి.
2023లో ప్రపంచ వృద్ది రేటు కనీవినీ ఎరుగనంత మందగమనానికి చేరుకుంటుంది. నిజానికి దాని ప్రభావం ఇప్పుడే కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు బిక్క మొహం వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. జనం పర్సుల్లో డబ్బులు ఉండటం లేదు. కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దాన్నే ఆర్థిక పరిభాషలో రిసెషన్ అంటున్నారు. మనకు తెలియకుండానే ఆ ఊబిలోకి కూరుకుపోయామని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
అమెరికా, కెనడా, యూకే, ఈయూ, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, చైనాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులున్నాయి. ప్రపంచంలోనే మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలపై రిసెషన్ ప్రభావం కనిపించడం మొదలైంది. ఏడాదిలో కాలంలో ఆయా దేశాల ఆర్తిక స్థితి ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. ఆ దేశాల ద్రవ్య విధానాలు, పెరుగుతున్న జీవన వ్యయం, వ్యక్తిగత ఆదాయాలు పెరగకపోవడమే ఇందుకు కారణమని నిర్ధారించారు. ఆ దేశాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థే దివాలా తీసే ప్రమాదం ఏర్పడింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో నేలచూపులు చూస్తున్నాయి. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అది. వస్తు సేవల రంగంలో అతి పెద్ద దిగుమతిదారు కూడా అమెరికానే. అమెరికా ఆర్థిక స్థితిగతుల ప్రభావం ప్రపంచ దేశాలపై ఉంటుంది. ఐరోపా దేశాలు అల్లాడిపోవడం ఖాయం. అందుకే అమెరికా వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు భయంగా చూస్తున్నాయి. ఆమెరికాలో ఏర్పడుతున్న మాంద్యం కారణంగా జర్మనీ, స్వీడన్, యూకే ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. సాంకేతికంగా చూస్తే యూకే ఇప్పటికే మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశ ఆర్థిక వృద్ది రేటు పాయింట్ రెండు శాతానికి పడిపోయింది. ఈ దుర్భర పరిస్థితులు కనీసం రెండేళ్లు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేస్తోంది. పన్నుల పెంచి, ప్రభుత్వ వ్యయాలు తగ్గించడం ద్వారా కొంచెమైనా బయటపడే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది…
దక్షిణాఫ్రికా వృద్ధి రేటు రెండు శాతానికి పడిపోయింది. అర్జెంటీనాలో ద్రవ్యోల్పణం 83 శాతానికి చేరింది. ఈజిప్టు అప్పులు ఆ దేశ జీడీపీలో 89 శాతానికి పెరిగాయి. ఎల్ సాల్వడార్, ఈక్వెడార్, ఘానా, నైజీరియా, ఇథియోపియా, పాకిస్థాన్, శ్రీలంక, కెన్యా లాంటి 15 దేశాలు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, చైనాలో మళ్లీ కరోనా విజృంభించడం, ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర లాంటి పరిణామాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇబ్బందిగా మారాయి. తక్షణ చర్యలు చేపట్టకపోతే మాంద్యం స్థిరపడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత పరిస్థితేమిటి, ఇండియా మునిగిపోతుందా లాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం, అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇండియా ఎలా తట్టుకుంటుందని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే తాజా అంచనాల ప్రకారం ఇండియాపై మాంద్యం ప్రభావం అంతగా ఉండదు. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాపై రుణభారం తక్కువగానే ఉంది. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండటం కూడా కలిసొచ్చింది. ఉద్యోగాలు చేసే వయసున్న జనాభా భారత్ లో ఎక్కువుంది. భారత్ లోకి పెట్టుబడుల వెల్లువ కనిపిస్తోంది. ఇక్కడ ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ప్యాండమిక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు
భారతీయులు భయపడాల్సిన అవసరం లేదంటే పూర్తిగా రిలాక్స్ కావాలని చెప్పినట్లు కాదు. అగ్రరాజ్యాల ఆర్థిక మాంద్య ప్రభావం భారతీయులపై ఎంతోకొంత ఉంటుందని మరిచిపోకూడదు. అక్కడ కంపెనీలు మూతబడితే మన వాళ్ల ఉద్యోగాలకు గండి పడటం ఖాయం. నిరుద్యోగం పెరుగుతుంది. ఉద్యోగాలు వెదుక్కోవడం కష్టమవుతుంది. ఉన్న బహుకొద్ది ఉద్యోగాలకు పోటీ పెరుగుతుంది. దిగుమతులపై ప్రభావం పడి వినియోగవస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పండుగలకు విచ్చలవిడిగా ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఆర్థిక రంగ విశ్వేషకులు సూచిస్తున్నారు గత ఏడాది పండుగకు కొన్న వస్తువులు, చేసిన ఖర్చులన్నీ బేరీజు వేసుకుంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ పది శాతం వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పైగా ఉన్న డబ్బులు అయిపోతే రేపటికి ఖర్చులకు కొత్త నిధులు సమకూరుతాయన్న విశ్వాసం లేదు. పెట్రోల్ ధరల నుంచి ఓటీటీకి సబ్ స్క్రిప్షన్ల వరకు అన్ని పెరుగుతున్నాయి కదా అందుకే భారతీయులా ఆలోచించి ఖర్చు పెట్టండి మీకే మంచిది.