నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్
పొలిటికల్ కెరీర్‌పై పవన్ హాట్ కామెంట్స్
ఐనా బాధలేదన్న జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పొలిటికల్ కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న పవన్ తానొక ఫెయిల్యూర్ పొలిటీషన్ అని అన్నారు. ఫెసింగ్ ది ఫ్యూచర్ అనే అంశంపై సీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లో తాను విఫలమయ్యానంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులంతా నో అంటూ సీఎం సీఎం అని నినాదాలు చేశారు. వైఫల్యాన్ని అంగీకరించాల్సిందేనని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఫెయిల్యూర్ గురించి బాధ లేదని చెప్పిన పవన్ ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి బాటలు వేస్తాయని చెప్పుకొచ్చారు. పవన్ చేసిన కామెంట్స్‌పై జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ చెప్పినట్టు ఫెయిల్యూర్‌ని అంగీకరించే పరిస్థితులో లేకపోయినా అలా చెప్పేందుకు గట్స్ ఉండాలంటున్నారు.
పవన్ ఏ ఉద్దేశంతో అన్నారో గానీ అది నిజమేనని అంగీకరించేవారున్నారు. పాలిటిక్స్‌లో ప్రస్తుతానికి పవన్‌ది ఫెయిల్యూర్ స్టోరీయేనని కొందరు అంటుంటే అదేం లేదని కొట్టిపారేసేవారు ఉన్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ 2008లోనే రాజకీయాల్లోకి వచ్చారు. తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం కష్టపడ్డారు. తదనంతరం పరిణామాలతో ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనంతో కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలపై ఫోకస్ చేసిన పవన్ తిరిగి మళ్లీ రాజకీయాలపై దృష్టిసారించారు. 2014లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మాత్రం మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా అప్పట్లో జనసేన పార్టీ నామమాత్రంగానే ఉండిపోయింది.
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి గుడ్‌బై చెప్పిన పవన్ వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకుంది. ఎన్ని ఓటములు ఎదురైనా ప్రజల కోసం సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటానని పవన్ కల్యాణ్ పలు సందర్భాలు చెబుతూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా ప్రత్యర్థిపార్టీల గెలుపోటములపై మాత్రం జనసేన ప్రభావం చూపుతోంది. ఏపీలో వైసీపీ, టీడీపీల తర్వాతి స్థానంలో ఉంది. పవన్ దూకుడైన రాజకీయాలతో జనసేన బాగా పుంజుకుంటోంది. ప్రస్తుతం బీజేపీతో కలిసి సాగుతున్న పవన్ 2024 ఎన్నికల్లో అధికారం చేపడుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గెలుపును అడ్డుకునేందుకు టీడీపీతోనూ జతకట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐతే బీజేపీ అడ్డుతగులుతుండడంతో ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి పవన్ వ్యూహం ఏవిధంగా ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా వైఫల్యాల నుంచి విజయానికి పునాదులు వేసుకుంటారా అనేది చూడాలి.