సెంటిమెంట్‌ ఒకటిరెండుసార్లే.. ఈసారి నో ఛాన్స్‌!

By KTV Telugu On 4 December, 2022
image

గంప’గుత్తా’గా అంతా మేమేనంటే ఎలా బాస్‌!

ప్రత్యేకరాష్ట్రంతో దశాబ్ధాల కల సాకారమైనప్పుడు ఆ జోష్‌ వేరు. దీక్షలు చేసి, సకలజనుల సమ్మెలు నిర్వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ అప్పట్లో అందరికీ తెలంగాణ జాతిపితలా కనిపించారు. అందుకే సంప్రదాయిక పార్టీలను పక్కనపెట్టి టీఆర్ఎస్‌కి జై కొట్టారు. మన రాష్ట్రం-మన ఆత్మగౌరవం అంటూ తర్వాతి ఎలక్షన్లలోనూ సెంటిమెంట్‌ని రగిలించారు. మున్ముందు ఎలా ఉంటుందోనన్న అనుమానంతో ముందస్తు గంట మోగించారు. బంగారు తెలంగాణ సాధించాలంటే సొంతింటి పార్టీనే అధికారంలోకి రావాలన్న భావోద్వేగాన్ని తెలంగాణ ప్రజలు మరోసారి బతికించారు. మరి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి గెలుస్తారా అంటే బల్లగుద్ది అవునని చెప్పలేని పరిస్థితి.

ప్రత్యేకరాష్ట్రం సాధించి తొమ్మిదేళ్లయింది. టీఆర్‌ఎస్‌పార్టీనే అధికారంలో ఉంది. బంగారు తెలంగాణ సాధ్యమైందా అంటే మొహాలు చూసుకునే పరిస్థితి. దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతుబంధు అమలవుతోంది. అన్నివర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన సంక్షేమపథకాలు నిరాటంకంగా నడుస్తున్నాయి. హుజూరాబాద్‌ బైపోల్‌ లక్ష్యంగా ప్రారంభించిన దళితబంధు ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. మరి అంతా బాగుంటే మరోసారి టీఆర్‌ఎస్‌కే జనం అధికారం కట్టబెట్టాలి కదా. కానీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. బీజేపీ బలపడింది. కాంగ్రెస్ పుంజుకుంటోంది. షర్మిల కొత్తపార్టీతో జనంలోకెళ్తోంది. తెలంగాణలో పోటీకి జనసేన కూడా కసరత్తు చేస్తోంది. ఆశలొదిలేసుకున్న తెలంగాణలో కొత్త నాయకత్వంతో పార్టీని బతికుంచుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం ఉంది.

టీఆర్‌ఎస్‌ గెలుపు ఈసారి నల్లేరుపై బండి నడకైతే కాదు. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలమీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వారిని పక్కనపెడితే అసంతృప్తి కారుపార్టీని ముంచేస్తుంది. ఇంటాబయటా సవాళ్లు టీఆర్‌ఎస్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే మళ్లీ సెంటిమెంట్‌ని రాజేసే ప్రయత్నం చేస్తోంది. మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి నోటినుంచి వచ్చిన మాటలే దీనికి సంకేతం. కేసీఆర్‌పై సమైక్యవాదులు కుట్ర చేస్తున్నారనేది గుత్తా ఆరోపణ. కేసీఆర్‌ని అడ్డు తప్పించి మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేయాలనుకుంటున్నారని సీనియర్‌ నేత అంటున్నారు. గుత్తాకంటే ముందే కొందరు నేతలు ఇదే వాదనను తెరపైకి తెచ్చారు. షర్మిల పాదయాత్ర చేస్తుంటే ఎప్పుడో కన్నుమూసిన ఆయన తండ్రిని కూడా నిందిస్తున్నారు. తెలంగాణవాదానికి అడ్డుపడింది వైఎస్సేనని గుర్తుచేస్తున్నారు. వెళ్లి ఆంధ్రాలో రాజకీయం చేసుకోమంటున్నారు. ఇదివరకు టీడీపీమీద కూడా ఇలాగే ఆంధ్రాపార్టీ అంటూ దాడి జరిగింది. రేపు జనసేన పోటీచేస్తానన్నా మీకు ఇక్కడేం పని అని నిలదీసే నేతలుంటారు. టీఆర్‌ఎస్‌ పేరులోనే తెలంగాణవాదం ఉంది. కానీ ఆ పార్టీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ మారింది. తెలంగాణ పేరునే లేకుండా చేసుకున్న కేసీఆర్‌ పార్టీ సెంటిమెంట్‌ రాజేస్తే జనం నమ్ముతారా? దేశమంతా విస్తరించే హక్కు కేసీఆర్‌కి ఉన్నప్పుడు తోటి తెలుగురాష్ట్రంలో తమకెందుకు చోటుండదన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? ఓసారి విడిపోయాక రెండు రాష్ట్రాలను కలపడం కుదురుతుందా? గుత్తాలాంటి నేతల వ్యాఖ్యలు ఫ్రస్టేషన్‌ బయటపెట్టుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావన్నది గుర్తుంచుకుంటే మంచిది.