నగదు మారకంలో దేశంలో ఇప్పుడో కొత్త విప్లవం. మన రూపాయి రూపుమారుతోంది. డిసెంబరు 1నుంచీ దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చేసింది. ప్రయోగాత్మకంగా మొదట ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ-రూపాయిని ప్రారంభించింది ఆర్బీఐ. పైలట్ ప్రాజెక్ట్‌లో డిజిటల్ రూపాయి సృష్టి, పంపిణీ, రిటైల్ వినియోగం ప్రక్రియను నిశితంగా పరిశీలించబోతున్నారు. తర్వాత రిటైల్ డిజిటల్ రూపాయిలో మార్పులు చేర్పులపై సమీక్షించాక భవిష్యత్తులో దేశమంతా అందుబాటులోకి రాబోతోంది ఈ-రూపీ. పైలట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ రూపీ మొదట న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. తర్వాత అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లాలకు విస్తరించనుంది. పైలట్ ప్రాజెక్టు మొదటి దశలో నాలుగు నగరాల్లో నాలుగు బ్యాంకులు ఈ-రూపీ చలామణిలో పాల్గొంటాయి, ఎస్బీఐ, ICICI బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఈ-రూపీ బాధ్యతలు తీసుకున్నాయి.
రెండవ దశలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటాయి. తదుపరి దశలో మరిన్ని బ్యాంకులు ఈ రూపీ పైలట్ ప్రాజెక్ట్ పరిధిని క్రమంగా విస్తరిస్తాయంటని వెల్లడించింది RBI. పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన చోట కస్టమర్లు, వ్యాపారుల క్లోజ్‌డ్ గ్రూప్ ఏర్పాటవుతుంది. బ్యాంకుల ద్వారా పంపిణీ అయ్యే ఈ-రూపాయిని వినియోగదారులు మొబైల్ డిజిటల్ వాలెట్లలో ఉంచుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఈ-రూపాయిని క్యాష్ రూపంలోకి కూడా మార్చుకునే వీలు కల్పించారు. ఈ-రూపాయి విలువ ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీకి సమానంగా ఉంటుంది. ఫిజికల్ కరెన్సీ మాదిరిగానే అంగీకరిస్తారు. ఈ-రూపాయితో జేబులో నగదు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఈ-రూపాయితో సేఫ్టీ, ప్రైవసీ మరింత పెరుగుతాయి. వర్చువల్ కరెన్సీ కాబట్టి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఈ-రూపాయితో నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. రూపాయి ముద్రణ ఖర్చు తగ్గటంతో పాటు లావాదేవీల ఖర్చును తగ్గించే విషయంలోనూ ఈ-రూపాయి సాయపడుతుందంటున్నారు. ఆఫ్‌లైన్‌లోనూ వాడే అవకాశం ఉండటంతో కరెంట్ లేకపోయినా, మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండకపోవడం ఈ-రూపాయి వల్ల చేకూరే మరో ప్రయోజనం.