ముందు డాక్యుమెంట్లు ఇవ్వండి
ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేయండి
సీబీఐ అధికారికి కవిత లేఖ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ నోటీసులందుకున్న ఎమ్మెల్సీ కవిత ఎక్కడా తగ్గడం లేదు. ఏం చేస్తారో చేసుకోండన్న ధోరణితో ఆమె ముందుకు సాగుతున్నారు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఈనెల 6న తన ఇంట్లో వివరణ ఇచ్చేందుకు సిద్ధమని కవిత చెప్పారు. అయితే, సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత ఆమె సీబీఐకి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి కవిత లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటుగా ఎఫ్‌ఐఆర్ కాపీని సాధ్యమైనంత త్వరగా తనకు ఇవ్వాలని ఆమె లేఖ ద్వారా కోరారు. సంబంధిత అనుబంధ కాపీలను కూడా అందించాలని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు పంపిన తర్వాతే డేట్ ఫిక్స్ చేసి హైదరాబాద్‌లో కలుద్దామంటూ లేఖ పంపారు.
అంతకుముందు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. ఇక ఆతర్వాత ప్రగతిభవన్‌కు వెళ్లిన కవిత ముఖ్యమంత్రితో పాటు న్యాయనిపుణులతో తాజా నోటీసులు రాజకీయ పరిణామాలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరారు కవిత. డాక్యుమెంట్లు అందిన తర్వాత మిగతా కథ అంతా చూసుకుందామనేవిధంగా టీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది.
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఇచ్చే నోటీసులు సమన్ల కిందికి రావనేది టీఆర్ఎస్ వర్గాల వాదన. కేసులో సందేహాలపై కేవలం వివరణ మాత్రమే కోరతారని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నట్టు సీబీఐ నోటీసును కేవలం వివరణ కోసమే అనే కోణంలో చూడొద్దని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే అని మున్ముందు అరెస్ట్ జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. వివరణ పేరుతో బీజేపీ వార్నింగ్ బెల్ మోగిస్తోందని దారికి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. అయితే తెలివిగా ఆమె కేసు కాపీలను కోరి ఆ తర్వా విచారణ సంగతి చూసుకుందామనడంపై తెలంగాణ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకొచ్చిన నాటి నుండే కవిత దీనిపై ప్రిపేర్డ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మహా అయితే జైల్లో పెడతారు పెట్టుకోండి అంటూ నోటీసులు అందిన సమయంలో హాట్ కామెంట్స్ చేశారు. ఇక కవితకు మద్దతుగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. కేసీఆర్, కవిత ఫోటోలతో డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్ తెలంగాణ గడ్డ కెసిఆర్ అడ్డా. వీఆర్ విత్ యూ కవితక్క అంటూ ఫ్లెక్సీలను ప్రచురించారు.