మోటార్లకు మీటర్లు పెడితే ఫ్యాన్ ఫ్యూజ్ పీకేస్తారు ! జగన్‌కు అర్థం కావడం లేదా ?

By KTV Telugu On 9 May, 2022
image

జగన్ తన అధికార మూలాల్ని తానే పెకిలించేసుకుంటున్నారు. తండ్రి వైఎస్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఆయన తెచ్చిన పథకాలకు పాతరేస్తున్నారు. తాజాగా మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు వైసీపీలోనే గగ్గోలు రేగుతోంది. మూలాలు మార్చిపోతే ప్రజలు మొత్తానికే పీకేస్తారని ఆందోళన చెందుతున్నారు. కానీ జగన్ ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితిలో లేరంటున్నారు.

ఉచిత విద్యుత్ హామీ పనైపోయినట్లే !

రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి అధికారం సాధిచారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించడంపై వ్యతిరేకత మీద ఆయన రాజకీయ పోరాటం చేశారు. ఇప్పుడు రాజన్న పాలన తీసుకొచ్చిన రాజన్న బిడ్డ పాలనలో మాత్రం మీటర్లు పెట్టడం ఎజెండాగా పెట్టుకున్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు. అంటే.. రాజన్న బిడ్డ తీసుకొచ్చిన రాజన్న పాలనలో.. రాజన్న ప్రవేశ పెట్టిన పథకానికే తిలోదకాలిచ్చేస్తున్నారన్నమాట. మీటర్లు పెట్టి బిల్లులు ఇస్తారు. బిల్లులకు రైతులు డబ్బులు చెల్లించాలి. కానీ ఆ డబ్బులు తాము రైతుల అకౌంట్‌లో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత విద్యుత పథకానికి బదులుగా నగదు బదిలీ ఇస్తున్నామని.. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని… మీటర్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ గ్యాస్ సబ్సిడీ లో చేసిన మాయాజాలం చూసి రైతులు ఎవరూ నమ్మడం లేదు.

గ్యాస్ కు నగదు బదిలీ లాగానే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ !

గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఎత్తివేసి.. ఎంత సబ్సిడీ ఇస్తున్నామో.. అంత మొత్తం వినియోగదారు ఖాతాలోకి మళ్లిస్తామని కేంద్రం ఓ సంస్కరణ తీసుకొచ్చింది. దీనిపై ప్రజల్లో గగ్గోలు రేగింది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆందోళనలు చేసింది. చివరికి ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాస్పద నిర్ణయం వద్దనుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే.. తాము వ్యతిరేకించిన నగదు బదిలీని అమలు చేయడం ప్రారంభించారు. మొదట్లో.. నాలుగు, ఐదు వందలు వచ్చే సబ్సిడీ.. ఇప్పుడు రూ. 40కి పడిపోయింది. పోనీ గ్యాస్ సిలిండర్ ధర ఏమైనా తగ్గిందా అంటే ఇంకా పెరిగిపోయింది. ఈ గ్యాస్ సబ్సిడీనే… కేస్ స్టడీగా తీసుకుంటే… ఆంధ్రప్రదేశ్ రైతులు … నగదు బదిలీ పేరుతో ఎలాంటి కష్టాల్లో చిక్కుకోబోతున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

అప్పుల కోసమే ఈ తంటాలు !

అప్పులివ్వాలంటే ఉచిత విద్యుత్‌కు బదులు రాష్ట్రాలు నగదు బదిలీ అమలు చేయాలనే షరతుని కేంద్రం పెట్టింది. ప్రభుత్వాలు బకాయిలు పెండింగ్ పెడితే.. అది లబ్దిదారులకే కానీ.. విద్యుత్ సంస్థలకు కాదు. అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వైదొలిగి.. రైతు భజాలపై భారం పెడుతోందన్నమాట. రైతులు ఎంత వాడుకుంటే.. అంత చెల్లించి తీరాల్సిందే. కానీ.. ప్రస్తుతం జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం బిల్లులు జనరేట్ అవ్వగానే… వేల కోట్లు ఎలా తెచ్చి రైతుల ఖాతాల్లో వేస్తుందనేది ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం. ఎప్పుడైనా ప్రభుత్వం చెల్లించడం ఆలస్యం అయితే.. రైతులు విద్యుత్ సంస్థలకు బాకీ పడినట్లవుతుంది.

ప్రజలు ఫ్యూజ్ పీకేస్తారు !

రాజన్న పాలన నడుస్తోందని… వైసీపీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా రాజన్న పాలన ఉండి ఉంటే. .. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ.. ఇప్పుడు.. ఉచిత విద్యుత్ అధికారికంగా లేనట్లే. దానిని నగదు బదిలీ చేస్తారు. ఇది చేయకపోతే… రైతులు కరెంట్ బిల్లులు కట్టుకోవడం ప్రారంభించాలి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్దు అనుకున్నది ఇదే . వీటన్నింటినీ ప్రజలు ఓటు వేసేటప్పుడు గుర్తు పెట్టుకుంటారు. ఫ్యూజ్ పీకేస్తారు. ఆ తర్వాతే తాము తప్పు చేశామని రియలైజ్ అవుతారు.