మూడు రోజుల్లో మూడు సార్లు కేసీఆర్‌తో కవిత భేటి

By KTV Telugu On 5 December, 2022
image

6వ తేదీన విచారణకు అందుబాటులో ఉండను
మరో తేదీ ఖరారు చేయండని సీబీఐకి లేఖ

దినదినగండం నూరేళ్ల ఆయుష్షులాగా ఉంది తెలంగాణలో రాజకీయ నేతల పరిస్థితి. ఏ దర్యాప్తు సంస్థ నుంచి ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో ఎవరిని విచారణకు పిలుస్తారో ఎవరిని అరెస్టు చేస్తారో తెలియక నాయకులు కంగారు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వేరు వేరు కేసుల్లో పోటాపోటీగా దర్యాప్తులు చేస్తూ అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్‌ లో దడ పుట్టిస్తున్నాయి. రీసెంట్‌గా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ప్రమేయం ఉందంటూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లేదా ఢిల్లీలో సీబీఐ అధికారుల ముందు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

అయితే తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే విచారణకు హాజరవుతానని కవిత సీబీఐకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఆమె శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీబీఐ నోటీసుల గురించి చర్చించారు. సీబీఐ విచారణకు సంబంధించి న్యాయనిపుణులతో కూడా సంప్రదింపులు చేశారు. ఆదివారం మరోమారు సీఎం కేసీఆర్‌తో కవిత చర్చించిన తరువాత సీబీఐ అధికారులకు జలక్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్ర హోంశాఖ సీబీఐకు చేసిన ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్ కాపీలను తనకు పంపించాల్సిందిగా సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షాహికి కవిత ఒక లేఖ రాశారు. ఆ డాక్యుమెంట్లు పంపిస్తే తనకు వివరణ ఇచ్చేందుకు సులువు అవుతుందని ఆ తర్వాతే తన విచారణకు తేదీని ఫిక్స్ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

కవిత కోరిక మేరకు ఆమె అడిగిన డాక్యుమెంట్లను పంపంచింది సిబీఐ. సోమవారం మూడో సారి కేసీఆర్‌ను కలిశారు కవిత. సీబీఐ అధికారులతో వ్యవహరించాల్సిన వ్యూహంపై మరోసారి చర్చించారు. ఆ వెంటనే కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని అయితే ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున 6వ తేదీన విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు అందుబాటులో ఉంటానని ఈ తేదీల్లో ఏదో ఒక తేదీని ఖరారు చేయండి అని పేర్కొన్నారు. కంప్లెయింట్‌లో కానీ ఎఫ్‌ఐర్‌లో కానీ తన పేరు ఎక్కడా లేదని అన్నారు కవిత. తాను న్యాయవ్యవస్తను నమ్ముతానని చెప్పారు. కవిత లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.