మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ

By KTV Telugu On 5 December, 2022
image

గుజరాత్‌ ఎన్నికల ముగింపుతో తెలంగాణపై ఫోకస్‌
16వ తేదీన కరీంనగర్‌లకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాక
గుజరాత్‌ చివరి దశ ఎన్నికలు నేటితో ముగిసాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తరువాతి నుంచి బీజేపీ పెద్దలు తెలంగాణపై ఫోకస్‌ చేయనున్నారనే చర్చ మొదలైంది. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన. అందుకే కొద్ది రోజులుగా ఆ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ముందస్తు ఎన్నికల ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అటు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు మొదలెట్టేశారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగుసార్లు ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు.

ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. తెలంగాణకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ కేటాయించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఈ ట్రైన్‌ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెలలలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలనే యోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమాలకు రావాల్సిందిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించగా, మోదీ అంగీకరించారని సమాచారం. గత నెలలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీదే అధికారమని, కేసీఆర్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు, నేతలు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై బాగా పోరాడుతున్నారంటూ కితాబిచ్చారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని ఒదిలిపెట్టే సమస్యే లేదని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మోదీ ఆరోపించారు. ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని కేసీఆర్ పై మరిన్ని విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే నాలుగుసార్లు మోదీ తెలంగాణకు వచ్చారు. గత నెలలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం రాగా జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మేలో ఐఎస్‌జీ వార్షికోత్సవం, ఫిబ్రవరిలో సమతా విగ్రహావిష్కరణ కోసం రాష్ట్రానికి వచ్చారు. అయితే సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా వెళ్లి ప్రధాని మోదీకి ఆహ్వానం పలకలేదు. తనకు బదులుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మోదీకి ఆహ్వానం పలకడానికి పంపించారు. రోజురోజుకూ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రాజకీయ వైరం ముదురుతున్నందున ఈసారి కూడా కేసీఆర్‌ ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్లే అవకాశం లేదని అనుకుంటున్నారు.

మరోవైపు డిసెంబర్ 16న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణకు రానున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. షెడ్యూల్‌ ప్రకారం బండి సంజయ్ పాదయాత్ర డిసెంబర్ 17, 18న ముగియాల్సి ఉంది. కానీ ఆ షెడ్యూల్ కంటే ముందే జేపీ నడ్డా రాష్ట్రానికి రానుండడంతో పాదయాత్రను ఆ రోజుతో ముగించేందుకు బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇక ఇప్పటి నుంచి బీజేపీ పూర్తి స్థాయిలో కేసీఆర్‌ను టార్గెట్‌ చేయబోతోందని భావిస్తున్నారు.