రెడ్డి అమ్మాయిల్ని అంతమాటనేశాడేంటి మల్లన్న

By KTV Telugu On 5 December, 2022
image

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది సామెత. మనిషి మంచోడేగానీ ఆయన నోరే తీటకొద్దీ వాగేస్తుంటుంది. ఫ్లోలో నోరుజారానని నాలుక మడతేస్తుంటుంది. అసలే మొన్నటిదాకా ఐటీ దాడులు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అనధికారిక లావాదేవీలు లెక్కకు మించి జరిగాయంటున్నారు. ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఐటీ తుదివిచారణలో అన్నీ బయటికొస్తాయి. మునుగోడు ఎన్నికల టైంలో మందుపార్టీ విజువల్స్ రచ్చరచ్చ చేశాయి. కాలం కలిసిరానప్పుడు కొన్నాళ్లు నోటికి తాళం వేసుకోవాలి. కానీ మల్లన్నకి మందిని చూస్తే పూనకమేనాయ. కాలేజీ ఫంక్షన్లలో పిల్లల్ని చూసినప్పుడల్లా మంత్రి మల్లారెడ్డి కుర్రాడైపోతుంటాడు. మా రోజుల్లో అంటూ పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటాడు. తానెంత కష్టపడి పైకొచ్చానో పిల్లలకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాసులు తీసుకుంటాడు. ఈ సార్‌ ఇంతేనంటూ పిల్లలు కూడా కామెడీ షోలా కాసేపు నవ్వుకుంటారు.

ఈసారి మల్లారెడ్డి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ శృతిమించింది. తనంత అదృష్టవంతుడు ఇంకోడు లేడని మురిసిపోయారు. కొడుకుని డాక్టర్‌ని చేసుంటే డాక్టర్ కోడలు వచ్చేదని రెడ్డి అమ్మాయినిచ్చి పెళ్లిచేస్తే పిక్నిక్‌లు, కిట్టీ పార్టీలంటూ తిరిగేదని అన్యాపదేశంగా నోరుజారేశాడు. బర్త్‌డేలు, పిక్నిక్‌లు అంటూ పిల్లల్ని పేరెంట్సే చెడగొడుతున్నారనేది మల్లారెడ్డి ఉవాచ. అంతవరకు ఓకే కానీ తన కోడలి గొప్పలు చెప్పుకునేందుకు మొత్తం కులంలోని అమ్మాయిలే గాలికి తిరుగుతున్నట్లు మాట్లాడటం తప్పు. రెడ్ల అమ్మాయిలను మల్లారెడ్డి కించపరిచారంటూ అప్పుడే దుమారం మొదలైంది. ఏం పార్టీలు, పిక్నిక్‌లకు మిగతా కులాల వాళ్లెవరూ వెళ్లడం లేదా అంటూ మల్లన్నమీద ప్రశ్నలవర్షం కురుస్తోంది. అలవాటులో పొరపాటుగా నోరుజారానని మల్లారెడ్డి మరోసారి లెంపలేసుకున్నారు. మంత్రి స్థాయి నాయకుడు నోరెలా జారతారు? తన వ్యాఖ్యలు పిల్లలమీద, సమాజంమీద దుష్ప్రభావం చూపిస్తాయని, దురుద్దేశాలు కలిగిస్తాయన్న సోయి కూడా లేకుండా ఎలా వాగేస్తారు.