చంద్రబాబు మెడకు ఈడీ ఉచ్చు

By KTV Telugu On 5 December, 2022
image

ఎందుకీ రీతి సాధింతురో..ఏల పగబూని బాధింతురో!
కోట్లు దిగమింగేందుకు ‘స్కిల్‌’ డెవలప్‌మెంట్‌!
ఈడీ నోటీసుదాకా వస్తుందేమో.. బీ కేర్‌ఫుల్‌ బాబూ!

అధికారంలోకి వచ్చేది మేమే. ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం. కొన్నాళ్లుగా టీడీపీ అధినేతతో పాటు పార్టీ ముఖ్యనేతలు తరచూ చేస్తున్న హెచ్చరికలివి. మళ్లీ అధికారయోగం ఉందో లేదో తేలడానికి ఏడాదిన్నర సమయం ఉంది. కానీ బిడ్డపోయినా పురిటికంపు పోలేదన్నట్లే ఉంది టీడీపీ పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కోటీ వెలుగుచూస్తున్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై ఈడీ రంగంలోకి దిగటంతో టీడీపీ పెద్దల గుండెల్లో గుబులు మొదలైంది.

చంద్రబాబు పాలనలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో రూ.241 కోట్ల అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆధారాలు సేక‌రించింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో అక్రమాలు నిర్థారణ అయినట్లు సమాచారం. దీంతో 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేయ‌డం కలకలం రేపుతోంది. మాజీ ఐఏఎస్‌ లక్ష్మినారాయణ, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ శివప్రసాద్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. ఈడీ ముందు విచారణకు నాలుగు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

2014-19 మ‌ధ్య జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థతో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ రూ.3,500 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం చేసుకుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ 10 శాతం వాటా రూ.370 కోట్లు. ఈ మొత్తంలో రూ.234 కోట్లు దారి మ‌ళ్లిన‌ట్లు ఆడిటింగ్‌లో బయటపడింది. పుణెకి చెందిన పలు కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈడీ వాసన పట్టిందంటే అవినీతి కంపుని కొట్టిపారేయలేం. ఏదో అధికారుల స్థాయిలో జరిగిందని చంద్రబాబు అండ్‌ కో బుకాయించడానికి లేదు. స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కచ్చితంగా ఉందంటున్నారు సజ్జల. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి తెలీకుండా ఇంత పెద్ద స్కామ్‌ జరిగే ఛాన్సే లేదంటున్నారు. ఏవండోయ్‌ చంద్రబాబుగారూ.. వింటున్నారా.