సినిమాలకు బజ్ అనేది ఉంటేనే మార్కెట్ ఉంటుంది. లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ఆ బజ్ ఎలా వస్తుందంటే కాంబినేషన్ వల్ల వస్తుంది. అందుకే క్రేజీ కాంబినేషన్స్‌ను వర్కవుట్ చేస్తూంటారు దర్శకనిర్మాతలు.. హీరోలు. రాజకీయాలకు కూడా దీనికేం తీసిపోవు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హిట్ కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్ సెట్ అవడానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో హిట్ కొట్టిన టీడీపీ – జనసేన కాంబినేషన్ సెట్ అవడానికి అంతా రెడీ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆ రెండు పార్టీలకు క్రేజ్ పెరిగిపోయింది.
పవన్‌తో ఎప్పట్నుంచో వన్‌సైడ్ లవ్‌లో టీడీపీ !
ఆంధ్రప్రదేశ్‌లో 2014 కూటమి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అయితే అప్పుడే పార్టీ పెట్టిన కారణంగా.., పవన్ కల్యాణ్ సీట్లు అడగలేదు. కానీ టీడీపీ – బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో అది సక్సెస్ ఫుల్ టీం. విడిపోవడం వల్ల టీడీపీ, జనసేన దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ బీజేపీపై మాత్రం అంత ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే ఆ పార్టీ సాధించడానికి.. పోగొట్టుకోవడానికి ఏపీలో ఏమీ లేదు. జనసేనతో పొత్తు కోసం టీడీపీ ఎప్పట్నుంచో రెడీగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడు ఓకే అంటుందా అని వన్ సైడ్ లవర్‌గా ఎదురు చూస్తోంది. గత ఎన్నికలకు ముందు కలసి రావాలని చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ పొత్తు కోసం సిద్ధమన్నారు. జనసేనతో పొత్తు పెట్టుపెట్టుకుంటే విన్నింగ్ కాంబినేషన్ అవుతుందని టీడీపీ నేతలకు గట్టి అంచనాలు ఉన్నాయి. అందుకే పవన్‌కు అండగా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా పవన్ కోసం మాట్లాడుతున్నారు.
సిద్ధమని సంకేతాలిచ్చిన పవన్ కల్యాణ్ !
కలసి రావాలని చంద్రబాబు పిలుపు ఇస్తే.. తాము సిద్ధమని జనసేన సంకేతాలు ఇచ్చింది. దీంతో వీరి పొత్తులు ఖాయమని.. కలసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. గతంలో టీడీపీని తాను గెలవకపోయినా ఓడిస్తానని సవాల్ చేసి .. కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు పవన్ కల్యాణ్. ఆయన గెలవలేదు కానీ ఆయన సవాల్ చేసినట్లుగా టీడీపీ ఓడిపోయింది. అంతకంటే ఘోరంగా జనసేన కూడా ఓడిపోయింది. జనసేనకు ఆరు శాతమే ఓట్లు వచ్చాయి. చివరికి పవన్ కల్యాణ్ కూడా ఓడిపోయి.. వైసీపీ నేతలతో దారుణమైన విమర్శలు పడాల్సి వస్తోంది. ఆయన రెండు చోట్ల పోటీ చేసి గెలవలేకపోయారన్న చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడైనా పొత్తులు పెట్టుకుంటే విన్ – విన్ ఫార్ములా ఉండాలి. కానీ ఇక్కడ పెట్టుకోకపోవడం వల్ల లూజ్ .. లూజ్ సిట్యూయేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ తెలుసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు పిలుపునకు సానుకూలంగా స్పందించారు.
బీజేపీ కూడా కలుస్తుందా ?
బీజేపీని కూడా కలుపుకోవాలా లేదా అన్నఅంశంపై సందిగ్ధం టీడీపీ నేతలకు ఉంది. ఆ పార్టీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదు. కూటమిలో చేరితే గొంతెమ్మ కోరికలు కోరుతారు. అంతే కాదు… వారు ఆ పార్టీలో అత్యధిక మంది నేతలు అధికార పార్టీకి సన్నిహితులు. జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఆ పొత్తు వల్ల ఒక్క ఓటు కలసి రాకపోగా ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ దూరమైపోయాయని జనసేన నేతలు బహిరంగంగానే చెబుతూంటారు. దీంతో బీజేపీతో మాత్రమే పొత్తు కొనసాగించే అవకాశాలే లేవు. ఉంటే టీడీపీ, బీజేపీ లేకపోతే టీడీపీ అన్నట్లుగా జనసేన పరిస్థితి ఉంది. ఈ కారణంగా సొంత కూటమి ఓటమి కోసం వారు కుట్రలు పన్నుతారన్న అనుమానాలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో 2014 కూటమికి మాత్రమే చాయిస్ కనిపిస్తోంది. పవన్ మాటల ప్రకారం అది ఖాయమే. ఎప్పుడనేది తేలాల్సి ఉంది. ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే వైసీపీ పని గోవిందా అని ఇప్పటికే అత్యధిక మంది లెక్కలు తేల్చేస్తున్నారు.