గుజరాత్ ఎగ్జిట్‌ పోల్ రిజల్ట్

By KTV Telugu On 5 December, 2022
image

మోడీషా గుజరాత్‌ మళ్లీ కమలానికే
గుజరాత్‌ తీపి..ఢిల్లీ చేదు..హిమాచల్‌ సస్పెన్స్‌
గుజరాత్‌లో మళ్లీ బీజేపీ.. హిమాచల్‌ నువ్వానేనా

రెండురాష్ట్రాల అసెంబ్లీ దేశరాజధానిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు. జనం మూడ్‌ని తెలుసుకునేందుకు సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌లాంటి ఎలక్షన్. అధికారిక ఫలితాలకు మూడు రోజుల ముందే జనం ఎటువైపుఉన్నారో ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. గుజరాత్‌ రాష్ట్రాన్ని మళ్లీ బీజేపీనే ఏలబోతోంది. తన కంచుకోటలాంటి రాష్ట్రంలో కమలంపార్టీ బలం మరింత పెరిగింది. 2017కంటే ఎక్కువ సీట్లనే బీజేపీ గుజరాత్‌లో కైవసం చేసుకోబోతోంది.

గుజరాత్‌లో మ్యాజిక్‌ చేస్తుందనుకున్న ఆమ్‌ఆద్మీపార్టీ ప్రభావం పెద్దగా లేదని తేలిపోయింది. కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టేసి ఆప్‌ సెకండ్‌ప్లేస్‌లో ఉంటుందన్న అంచనాలు తలకిందులు కాబోతున్నాయి. బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. ఒక్కో ఎగ్జిట్‌పోల్‌ ఒక్కో లెక్క చెప్పినా కాంగ్రెస్‌కి 35నుంచి 50 సీట్లదాకా రాబోతున్నాయి. 2017 ఎన్నికలకంటే తక్కువ సీట్లతో కాంగ్రెస్‌ సరిపెట్టుకోబోతోంది. ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక బీజేపీకి గుజరాత్‌లో కలిసొచ్చింది.

మరో బీజేపీ పాలిత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం పోటీ నువ్వానేనా అన్నట్లుంది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఏడెనిమిది సీట్ల తేడా కనిపిస్తోంది. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ మాత్రం హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు దక్కుతాయని ఢంకా బజాయిస్తున్నాయి. గుజరాత్‌ మళ్లీ దక్కుతుందనే ఆనందం కంటే ఢిల్లీ మున్సిపాలిటీ చేజారుతుందనే సంకేతం బీజేపీని నిరాశపరుస్తోంది. పదిహేనేళ్లుగా బీజేపీ చేతుల్లో ఉన్న ఎంసీడీపై ఆమ్‌ఆద్మీ జెండా ఎగరబోతోంది. బీజేపీకంటే ఆమ్‌ఆద్మీకి రెట్టింపు సీట్లు వచ్చేలా ఉన్నాయి. స్లమ్స్‌లో దుమ్ము దులిపిన చీపురుపార్టీ కాలనీల్లోనూ తన సత్తా చాటింది. గుజరాత్‌లో అంచనాలు తలకిందులైనా ఢిల్లీ మున్సిపాలిటీలో మెజారిటీ సీట్ల సంకేతాలతో ఆప్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది.