గుజరాత్‌లో బీజేపీ గెలిస్తే తెలంగాణలో ప్రభావం ఎంత. కమలం మళ్లీ తొడకొడుతుందా ?

By KTV Telugu On 7 December, 2022
image

గుజరాత్‌లో బీజేపీ గెలిస్తే తెలంగాణలో బలపడుతుందా ?
అంతా తమ గాలే వీస్తుందని చెలరేగిపోతుందా ?
మిషన్ తెలంగాణలో కొత్త ప్లాన్లు ఏమైనా అమలు చేస్తుందా ?

భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో వరుసగా ఏడో సారి గెలిచే ఊపులో ఉంది. ఎగ్దిట్ పోల్స్ అవే చెప్పాయి. ప్రదాని మోడీ తనే సీఎం అభ్యర్థి అన్నట్లుగా గుజరాత్‌లో ప్రచారం చేశారు. రోడ్ షోలలో పాల్గొన్నారు. ఇంత చేసిన తర్వాత ఓడిపోతే మోడీ ఇమేజ్ పడిపోతుంది. అలాంటి పరిస్థితి రాకపోవచ్చు. అక్కడ గెలిచిన ఊపుతో బీజేపీ ఏం చేయబోతోంది ? ఇతర రాష్ట్రాల్లో కొత్త ప్లాన్లు వేస్తుందా? అంతా తమ గాలే వీస్తుందని చెలరేగిపోతుందా ?. ఇతర రాష్ట్రాల సంగతేమిటో కానీ ప్రస్తుతం పెట్టుకున్న మిషన్ తెలంగాణలో కొత్త ప్లాన్లు ఏమైనా అమలు చేస్తుందా ?

పాజిటివ్ వేవ్ ఉందని ప్రచారం చేసుకోవడమే బీజేపీ ఫస్ట్ ప్లాన్
ఉప ఎన్నికలతో తమ వేవ్ ఉందని చూపించే ప్రయత్నం ఫెయిల్
గుజరాత్‌ గెలుపుతో అలాంటి పాజిటివ్ సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం ఖాయమే !

భారతీయ జనతా పార్టీ పెద్దలది మొదటి నుంచి ఒకటే వ్యూహం. అంతా బీజేపీ గాలేనని భావించేలా చేయడం. ఎన్నికలకు వెళ్లడం. గత కొన్నేళ్లుగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తున్నాయంటే రెండేళ్ల ముందు నుంచి బీజేపీదే విజయం అని సర్వేలు పుట్టగొడుగుల్లా సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అదంతా ఉత్తరాది ప్లాన్. కానీ దక్షిణాదిలో మాత్రం వర్కవుట్ కాదని ఉపఎన్నికలతో ప్రయత్నం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచామని ఇక మునుగోడులో గెలిస్తే గాలి అంతా తమదేనని అనిపించాలనుకున్నారు. కానీ బోర్లా పడ్డారు. దీంతో సీన్ మారిపోయింది. కానీ ఇప్పుడు గుజరాత్‌లో వచ్చే గెలుపుతో అలాంటి పాజిటివ్ సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించకుండా ఉండరు. చేస్తారు. కానీ ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉండటం కష్టమే.

గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై తక్కువే. !
గుజరాత్‌లో ఏడు సార్లు బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఇతర పార్టీల్లో నాయకత్వ లోపం
మోదీని ఎదుర్కొనే నేత లేరు !
తెలంగాణలో రివర్స్‌లో బీజేపీ
తెలంగాణలో కేసీఆర్ కాకపోతే ఎవరు ?

గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ మీద దాదాపుగా ఉండవు. ఎందుకంటే గుజరాత్‌లో ఏడు సార్లు బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఇతర పార్టీల్లో ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి లేకపోవడం. ఉన్నా మోదీని ఢీకొట్టే స్థాయిలో అభ్యర్థి లేకపోవడం. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ ఉన్న ఒక్క నాయకుడు కూడా లేరు. మోదీ కాకపోతే ఎవరు అన్నదానికి సమాధానం లేదు. అందుకే ప్రజలు మోదీని చూసే ఆదరిస్తున్నారు. అదే్ పరిస్థితి తెలంగాణలో రివర్స్‌లో బీజేపీకి ఉంది. అంటే గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఉన్న పరిస్థితే తెలంగాణలో బీజేపీకి ఉంది. తెలంగాణలో టాల్ లీడర్‌గా కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ. మరి కేసీఆర్ ను ఢీ కొట్టే నేత బీజేపీలో ఎవరు ? బండి సంజయ్.. ఈటల రాజేందర్.. కిషన్ రెడ్డి.. లక్ష్మణ్.. ఇలా రాసుకుంటూ పోతే పది మందికిపైగా నాయకులు కనిపిస్తారు. కానీ వారెవరైనా కేసీఆర్ ఇమేజ్‌కు సరితూగలేరు. రేపు ఓట్లేసే సమయంలో కేసీఆర్ కాకపోతే ఎవరు అన్న ప్రశ్న ప్రజలకు వస్తే బీజేపీ నిలబడటం కష్టం. అలా అని పూర్తిగా బీజేపీ ప్లస్ కాదా అని రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఇది రాజకీయం. ఏమైనా జరగొచ్చు.

ముందస్తుకు వెళ్లేందుకు కేసీఆర్ కసరత్తు
మార్చి డెడ్‌లైన్‌గా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న ఓ అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. కేసీఆర్ ఇటీవల అన్ని విషయాల్లోనూ జోరు పెంచారు. మార్చిలోపు అభివృద్ది పనులన్నీ కళ్ల ముందు కనిపించేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ రూపు రేఖల్ని దాదాపుగా మార్చేశారు. 17 ఫ్లైఓవర్లు నగరం నలుదిక్కూలా ప్రారంభించారు. ఇంకా ప్రారంభించాల్సినవి ఉన్నాయి. కొత్తగా మెట్రోరైలు విస్తరణకు శంకుస్థాపన చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా రోడ్లను మెరుగ్గా తీర్చిదిద్దేలా టెండర్లు పిలుస్తున్నారు. సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో సంక్రాంతికి ప్రారంభించనున్నారు. అమరుల స్మారకాన్నీ అదే రోజు ప్రారంభిస్తారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరిస్తారు. కొత్త సంక్షేమ పథకాలు అంటే జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులిచ్చే పథకాలను కూడా ప్రారంభిస్తారు. అన్నీ మార్చిలోపే అయిపోనున్నాయి. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. దీనికి మరో బలమైన కారణం ఎన్నికల యుద్ధానికి ప్రత్యర్థులు రెడీ కాక ముందు సమరభేరీ మోగించాలనే వ్యూహం.

ఇంకా ఎన్నికలకు సిద్ధం కాని బీజేపీ
నియోజకవర్గ స్థాయి నేతల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్
బీజేపీకి గ్రామ స్థాయిలో లేని క్యాడర్
నియోజకవర్గం మొత్తాన్ని నడిపించే నాయకుల కొరత
టీఆర్ఎస్‌ నుంచి భారీ చేరికల ప్లాన్‌కు ఫామ్‌హౌస్ కేసుతో గండి
కాంగ్రెస్ నేతల్ని చేర్చుకున్నా.. వారి వల్ల ప్రయోజనం శూన్యం

భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇంకా సిద్ధం కాలేదు. అభ్యర్థుల కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలేమీ సఫలం కావడం లేదు. తెలంగాణ బీజేపీ టీఆర్ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున చేరికల కోసం ప్రయత్నించింది. ఫామ్ హౌస్ కేసు కావొచ్చు, మునుగోడు ఉపఎన్నికల ఎఫెక్ట్ కావొచ్చు లేదా బీజేపీకి గ్రామ స్థాయిలో క్యాడర్ లేకపోవడం వల్ల కావొచ్చు ఏదైనా కారణం కానీ టీఆర్ఎస్ నుంచి చేరికలు మాత్రం ఆశించినట్లుగా లేవు. బీజేపీలో నియోజకవర్గం మొత్తాన్ని నడిపించే నాయకుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామని రేసులోకి నియోజకవర్గానికి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు కానీ వారెవరూ పార్టీ బలానికి తమ బలం యాడ్ చేసి సీటును గెలిపించుకువస్తామనే వాళ్లు కాదు. పూర్తిగా పార్టీ మీద ఆదారపడేవారే. ఫామ్ హౌస్ ఎపిసోడ్ బయటపడకపోయి ఉంటే టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ఉండేవారు. ఆ తర్వాత ఓ వేవ్ కనిపించేది. పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందలయింది. ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన వారు రివర్స్ అయిపోయారు. ఇప్పుటికిప్పుడు టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వల్ల ఆ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరేందుకు అ ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ నేతల్ని చేర్చుకున్నా వారి వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోవడం లేదు.

తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం ఏడు శాతం ఓట్లు
వందకు పైగా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు
హూజూరాబాద్, మునుగోడులో వలస వచ్చిన నేతల వల్ల రేసులోకి !
నాగార్జున సాగర్‌లో అలాంటి వారు లేకపోవడం వల్ల డిపాజిట్ గల్లంతు
ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వస్తేనే బీజేపీ రేసులో !

తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం ఏడు శాతం ఓట్లు. వందకు పైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు కూడా పరిస్థితి మెరుగుపడిందన్న ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నాగార్జున సాగర్ ఉపఎన్నిక హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికలను విశ్లేషిస్తే బీజేపీ బలంలో డొల్లతనం బయటపడుతుంది. హూజూరాబాద్, మునుగోడులో వలస వచ్చిన నేతల వల్ల రేసులోకి వచ్చింది. కానీ నాగార్జున సాగర్‌లో అలాంటి వారు లేకపోవడం వల్ల డిపాజిట్ కోల్పోయింది. అంటే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వస్తేనే ఆ పార్టీ నిలబడుతుంది. బీజేపీ వేవ్ ఉందని.. ఎవర్నీ పెట్టినా గెలిపించే పరిస్థితి ఉంటుందని వారూ అనుకోవడం లేదు. గుజరాత్‌లో గెలుపు ఇక్కడ గెలుపు గుర్రాలను పార్టీలోకి తెచ్చే చాన్స్ దాదాపుగా లేదు.

అంతర్గత సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సిద్ధం కాని స్థితిలో కాంగ్రెస్

మరో వైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. ఇప్పుడు కాదు ఆ పార్టీ వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలు జరిగినా సన్నద్ధం కాదు. ఎందుకంటే వారిలో వారే కొట్లాడుకోవడానికి సమయం సరిపోదు. డిసెంబర్ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకుంటే దాన్ని ఆపడానికి ఇతరులందరూ ఏకమయ్యారు. ఇలాంటివి కాంగ్రెస్‌లో సహజం. ఆ పార్టీకి ముందస్తు ఎన్నికలంటే ముచ్చెమటలే.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 46.9 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 28 శాతం.
బీజేపీకి 7.1 శాతం
టీడీపీకి మూడున్నర శాతం ఓట్లు
ఎంత ఎదిగినా ఏడు శాతం నుంచి యాభై శాతానికి వెళ్లడం అసాధ్యం.

గత ఎన్నికల్లో అన్ని పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ టీఆర్ఎస్‌కు 46.9 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 28 శాతం. గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. బీజేపీకి 7.1 శాతం.. టీడీపీకి మూడున్నర శాతం ఓట్లు వచ్చాయి. ఎంత క్లియర్‌గా చూసుకున్నా టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఎంత ఎదిగినా ఏడు శాతం నుంచి యాభై శాతానికి వెళ్లడం అసాధ్యం. అలాంటి వాతావరణం కన్పించడం లేదని బీజేపీ అభ్యర్థుల మీద ఆధారపడి సాదిస్తున్న ఉపఎన్నికల రిజల్ట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ ఏదైనా పొందగలదు అంటే అది కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌నే. టీఆర్ఎస్ బ్యాంక్ లో ఒకటి రెండు శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కింద మారినా పెద్దగా ప్రభావం పడదు.

ఎలా చూసినా గుజరాత్‌లో గెలిచి తెలంగాణలో గాలి కొట్టినా బీజేపీకి పెద్దగా ఒరిగే రాజకీయ ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే బీజేపీ బలపడ్డామని హైప్ క్రియేట్ చేసుకుంటోంది కానీ నిజంగా బలపడలేకపోతోంది. అలా బలపడితే అభ్యర్థుల సమస్యే ఉండకూడదు. కానీ ఇప్పుడు బీజేపీ పూర్తి రివర్స్‌ లో ఉంది.