కవితను 11వ తేదీన విచారించనున్న సీబీఐ
అరెస్టు చేస్తారేమోనని టీఆర్‌ఎస్‌లో ఆందోళన
తెలంగాణ రాజకీయాలు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు చేస్తున్న దర్యాప్తులతో నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో ఎవరిని అరెస్టు చేస్తారో అని బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం మీ ఇంటికి వస్తామని కవితకు సీబీఐ నుంచి మెయిల్ వచ్చింది. నిజానికి ఈ నెల 6వ తేదీనే కవిత ను సీబీఐ విచారించాల్సింది ఉండింది. అయితే సీఎం కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చించిన మీదట 6వ తేదీన తాను అందుబాటులో ఉండలేనని 11, 12, 14, 15 తేదీల్లో ఏదైనా ఒక రోజు రావాలని సీబీఐకి లేఖ రాశారు కవిత.
ఆమె ఇచ్చిన తేదీలను పరిగణలోకి తీసుకున్నామని 11న ఉదయం 11 గంటలకు మీ ఇంటికి విచారణ నిమిత్తం వస్తామని అందుబాటులో ఉండాలంటూ సీబీఐ డీఐజీ రాఘవేంద్రవత్స ఎమ్మెల్సీ కవితకు మెయిల్ పంపారు. 11వ తేదీన విచారణకు కవిత సిద్ధమయ్యారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను సీబీఐ విచారించాలని అనుకోవడం కీలక పరిణామం అనంటున్నారు పరిశీలకులు. సీబీఐ విచారణ తర్వాత లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని తేలితే దాన్ని టీఆర్‌ఎస్ అస్త్రంగా మల్చుకుంటుంది. తమను వేధించడానికి బీజేపీ కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతోందని కేసీఆర్ చేస్తున్న ప్రచారానికి బలం చేకూరుతుంది. దీంతో బీజేపీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే టీఆర్‌ఎస్‌కు అలాంటి అవకాశాన్ని బీజేపీ ఇవ్వదు అనంటున్నారు పరిశీలకులు.
అందుకే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఇరికించే ప్రయత్నం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. సీబీఐ విచారణ వరకూ వెళ్లి ఆ తర్వాత బీజేపీ వెనక్కి తగ్గే అవకాశాలు లేవని దేశ వ్యాప్తంగా ఆ పార్టీ చర్యలను గమనిస్తున్నవారు చెబుతున్న మాట. 11వ తేదీన కవితను సీబీఐ విచారించడం అందులో భాగమే అనుకుంటున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని అన్నట్లు డైరెక్టుగా సీఎం కేసీఆర్ కూతురిని టార్గెట్ చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది.
11వ తేదీన కవితను విచారించిన అనంతరం సీబీఐ ఏం చర్యలు తీసుకుంటుందోనని గులాబీ దళం ఆందోళన చెందుతోంది. సీబీఐ ప్రతిస్పందన ఎలా ఉన్నా అది ముందుముందు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.