కాంగ్రెస్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు భావసారూప్యం ! సజ్జల చెప్పేశారా ?

By KTV Telugu On 10 May, 2022
image

భావ సారూప్య పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తమ పార్టీ పొత్తుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీతో భావసారూప్యం ఎవరికి ఉందా అని చూస్తున్నారు. అందరికీ ఒకటే కనిపిస్తోంది.. అదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన ఆ పార్టీ అధినేత దగ్గర్నుంచి.. భావజాలం వరకూ మొత్తం కాంగ్రెస్‌దే. కేసులు.. ఇతర కష్టాల కారణంగా బీజేపీకి బలవంతంగా మద్దతు ఇవ్వాల్సి వస్తోంది కానీ.. రేపైనా మాపైనా జాతీయ రాజకీయాల్లో వైసీపీకి కాంగ్రెస్సే దిక్కన్న వాదననను సజ్జల పరోక్షంగా చెప్పినట్లయిందంటున్నారు.

పీకే పొత్తు సలహాలను ఖండించని వైసీపీ !

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ హైకమాండ్‌కు బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఏమీ లేని ఏపీలో ఎవరు పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఓకే. ఓకటీ అరా సీట్లు ఇచ్చినా .. వచ్చినా చాలు. అదే సమయంలో వైసీపీ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే.. వైసీపీ డీఎన్‌ఏ కాంగ్రెస్ అని.. దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయ వ్యూహాలను ఖరారు చేసే పీకేనే కాంగ్రెస్ పార్టీకి ఈ సలహా ఇచ్చారు. పీకే సిఫార్సుపై వైసీపీ ఉలిక్కి పడలేదు. ఆశ్చర్యపోలేదు. ఖండన దండనలు రాలేదు. సహజంగా అయితే పీకేపై వైసీపీ సోషల్ మీడియా బూతులతో విరుచుకుపడాలి. కానీ సంయమనం పాటిస్తోంది. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదని వారికి తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారికే మద్దతనే వాదన అందరూ వినిపిస్తున్నారు.

బీజేపీతో అవసరాల రీత్యానే ఇప్పుడు బయటపడలేకపోతున్నారా ?

జగన్ కు కేసులు.. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి మద్దతు ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. బీజేపీతో అంట కాగుతూ ఇంత కాలం కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు సైలెంటవుతున్నారు. అయితే ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున ఇప్పుడే ప్లేటు ఫిరాయిస్తే.. కేసుల ఇబ్బందులు ఉంటాయని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ .. వైసీపీ ఓటు బ్యాంక్ ఒక్కటే. అందరూ అనుకుంటున్నట్లుగా రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ కి ఈ దుస్థితి రాలేదు.. కేవలం జగన్ పార్టీ పెట్టడం వల్లనే అనేది అందరూ అంతర్గతంగా అంగీకరించే విషయం. ఇప్పుడు జగన్ బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల మైనార్టీలు, దళితులు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారు ఒకటి, రెండు శాతం వైసీపీకి దూరం జరిగినా.. తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమీకరణాలన్నీ ప్రశాంత్ కిషోర్ వైసీపీకి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎలా చూసినాప్రశాంత్ కిషోర్ .. వైసీపీ అనుమతి లేకుండా కాంగ్రెస్‌కు పొత్తు ప్రతిపాదన చేయరని అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్‌తో ఆయనకు అంత సాన్నిహిత్య ఉంది. అంటే ఏపీ రాజకీయాల్లో ఈ సారి జగన్ , కాంగ్రెస్ కలిసి వెళ్తాయన్నని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

వైసీపీది భిన్నమైన పరిస్థితి !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ కూటమిలో లేదు. రాజకీయ ఇతర అవసరాల కోసం కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో సన్నిహితంగా ఉండక తప్పని పరిస్థితి. పీకే కూడా దీనికి సొల్యూషన్ జగన్‌కు చెప్పారని అంటున్నారు. కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే… వేధిస్తోందని ప్రచారం చేసుకుని.. సానుభూతి వ్యూహం రూపొందిద్దామని.. బాగా వర్కవుట్ అవుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏడాది లేదా ఏడాదిన్నర ముందుగా కేంద్రంపై యుద్ధం ప్రకటించి.. పీకే సలహా మేరకు కాంగ్రెస్‌తో జట్టుకడితే అప్పుడు.. కేంద్రం .. కేసుల పేరుతో ఇబ్బంది పెట్టినా ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే… పీకే మరో బలమైన పార్టీని కాంగ్రెస్ కూటమి వైపు లాక్కెళ్లినట్లే అవుతుంది. బీజేపీకి షాక్ తగిలినట్లు అవుతుందని అనిపిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలతోనే వైసీపీ తిరగబడుతుందా ?

వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. వైసీపీ కి తప్పని సరిగా మద్దతివ్వాల్సిన పరిస్థితి. ఒక వేళ తిరగబడాలని … బీజేపీతో దూరం అవ్వాలని నిర్ణయించుకుంటే… ఆ ఎన్నికలనే అస్త్రంగా చేసుకునే అవకాశం ఉంది. అప్పుడే బీజేపీ అభ్యర్థి కాకుండా ఇతర కూటమి అభ్యర్థికి లేదా.. ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉండటం వంటివి చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోతుంది. అందుకే సజ్జల నోటి వెంట భావసారూప్య మాటలు వస్తున్నాయని అంటున్నారు.