బండి సంజయ్ పొగాకు నములుతాడన్న కేటీఆర్
కేటీఆర్ డ్రగ్ బానిస అని బండి సంజయ్ ఆరోపణలు
నిజానిజాల మాటెలా ఉన్నా బట్ట కాల్చి ప్రత్యర్థుల మొహాన వేయడం రాజకీయ నాయకులు చేసే పని. ఆధారాలు లేకున్నా ఏదో ఒక ఆరోపణ చేయడం వారికి అలవాటు. దీనికి ఏ పార్టీ ఏ నాయకుడూ మినహాయింపు కాదు. అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్లు అందరూ అలా నోటికి పని చెప్పేవారే. అయితే ఒక్కోసారి వారు చేసే ఆరోపణలు తీవ్రంగా ఉంటాయి. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి ఆరోపణలే చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ కు డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు చేయించుకుని సచ్ఛీలుడిగా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తనకు పొగాకు నమిలే అలవాటు ఉందన్న కేటీఆర్ చేసిన విమర్శలపై బండి ఈవిధంగా స్పందించారు. ప్రస్తుతం బండి సంజయ్ నిర్మల్ లో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. అక్కడ ఒక ర్యాలీలో ఆయన మాట్లాడారు.
తాను పొగాకు నములుతానని కేటీఆర్ అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం తనకు పొగాకు తినే అలవాటు లేదని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నా శరీరంలో రక్తం సహా ఏ నమూనాను అయినా పరీక్షల కోసం ఇస్తా అని బదులిచ్చారు బండి. కేటీఆరే డ్రగ్స్ కు బానిస అయ్యాడు. రక్తం, వెంట్రకల నమూనాలు ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని నిరూపించుకునేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దుమ్ముంటే హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను తిరిగి తెరిచి, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ డ్రగ్ బానిస కాబట్టే హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను మూసివేసినట్టు ఆరోపించారు.