బీజేపీ “లోన్ ప్లాన్” ! కేసీఆర్‌కు దారేది ?

By KTV Telugu On 10 May, 2022
image

తెలంగాణలో కేసీఆర్‌పై రాజకీయ పోరాటంలో బీజేపీ ఎక్స్‌ ట్రీమ్ స్టెప్‌లు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ఆర్థిక మార్గాలను పూర్తిగా మూసేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అప్పులు పుట్టకుండా చేయడానికి చేయాల్సినదంతా చేస్తోంది. కేంద్రం ప్రతి రాష్ట్రానికి .. న్యాయంగా ఇవ్వాల్సిన అప్పు అనుమతుల్ని ఈ సారి పూర్తిగా పక్కన పెట్టేస్తోంది. ఇప్పటికే ఎక్కువ తీసుకున్నారన్న కారణంగా ఈ ఏడాది అప్పులు చేసే పరిమితిని నియంత్రిస్తోంది. సహజంగానే బీజేపీయేతర ప్రభుత్వాలు .. ముఖ్యంగా బీజేపీతో ఫైట్ చేస్తున్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూల్స్ స్ట్రిక్ట్‌గా అమలు కాబోతున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. దీంతో అప్పులు పుట్టక తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతోంది.

తెలంగాణకు అప్పుల అనుమతిపై తేల్చని కేంద్రం !

రెండేళ్ల నుంచి రాష్ట్ర బడ్జెట్ తో సంబంధం లేకుండా అదనంగా రూ.1.20 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకున్నారని కేంద్రం ఆర్థిక శాఖ లెక్కలే తేల్చింది. ఈ అప్పుని ఎలా తీరుస్తారు .. మీ బడ్జెట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అని ప్రశ్నిస్తోంది. అయితే తెలంగాణ మాత్రం బడ్జెట్ వెలుపలా తీసుకున్న రుణాలను రాష్ట్ర సంపదను సృష్టించడానికి ఉపయోగపడే కాళేశ్వరం మిషన్ భగీరథ ఇలాంటి పథకాలకు ఖర్చు పెట్టామని చెబుతోంది. ఈ రుణాలను సంక్షేమ పథకాలకు, అనుత్పాదక రంగాలకు ఖర్చు పెట్టలేదని వాదిస్తోంది. అయితే తీసుకున్న అప్పులను తిరిగి తీర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మద్దతు ఇచ్చేలా లేదని స్పష్టం చేస్తోంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం రుణాలకు అనుమతి కష్టమేనని భావిస్తుననారు.

ఏపీతో పోలిస్తే తెలంగాణపై వివక్ష !

ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసింది. అయినా అక్కడి ప్రభుత్వానికి అవసరమైన మేర కాస్త బెట్టు చేసి అయినా అప్పులిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ అనుత్పాదక రంగాలకు ఖర్చు చేస్తున్నారు. అయినా కేంద్రం రూల్స్ ను తెలంగాణ వంటి రాష్ట్రాలకే వర్తింపచేస్తోంది. నిబంధనల పేరుతో రాష్ట్రాల అప్పులకు ఆంక్షలు పెట్టడం వివక్షేనని తెలంగాణ భావిస్తోంది. కార్పొరేషన్ ల కోసం తీసుకున్న అప్పులతో ప్రాజెక్టులు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయని ..అవి పూర్తయితేనే ఫలాలు అందుతాయని లేకపోతే భారమవుతాయని తెలంగాణ ఆందోళన చెందుతోంది. ఎలాంటి వివక్ష లేకుండా వీలయినంత తొందరగా రుణం తీసుకోడానికి అనుమతి కోరుతోంది. కానీ ఇలాంటి విషయాల్లోనూ రాజకీయ కోణాలు చూడటంతో తెలంగాణకు ఆర్థికపరంగా చిక్కులు తప్పడంలేదు

ఆర్థికంగా ఇరుక్కుపోయిన తెలంగాణ !

అప్పులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో తెలంగాణ ఏప్రిల్ నెల మొత్తం మూడు వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకోలేకపోయింది. మే నెల మొదటి వారంలో మరో 3 వేల కోట్ల రూపాయలను అందుకోలేకపోయింది. దీంతో ఈ నెల చివరి లేదా జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయాల్సిన ఏడున్నర వేల కోట్ల రైతు బంధు నిధులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికితోడు దళిత బందుకు కూడా నిధులను సమీకరించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ఆలోచనను చూస్తుంటే ఈ సంవత్సరం అప్పులు పుట్టే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదంతా రాజకీయ కోణంలోనే జరుగుతోందని.. ప్రజలకు సంక్షేమం అందకుండా చేసి తమపై అసంతృప్తి పెరిగేలా చేయాలనుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు.

కేసీఆర్ ముందు దారేది ?

బీజేపీతో తాడో పేడో అన్నట్లుగా రాజకీయం మార్చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అత్యవసరంగా తెలంగాణ ఆర్థిక అవసరాలను తీర్చే మార్గాలను కనుగొనాల్సి ఉంది. కేంద్రం సహకరించకపోతే అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ అసలైన సవాల్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జీతాలు ఆలస్యమవుతున్నాయి. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటివన్నీ అధిగమించాల్సి ఉంది.