బీజేపీకి చీపురుకట్ట దెబ్బ.. ఢిల్లీలో పరాజయం!
బీజేపీ విజయ ప్రస్థానానికి బ్రేక్ వేసిన ఆమ్ఆద్మీ
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలీ అంటూ ఢిల్లీ వీధుల్లో చీపురుకట్టతో డ్యాన్సేస్తోంది ఆమ్ఆద్మీపార్టీ. పదిహేనేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ని ఏలుతున్న బీజేపీని కేజ్రీ పార్టీ ఊడ్చేసింది. గుజరాత్లో మళ్లీ గెలవబోతున్నామన్న ఆనందం ఢిల్లీ ఫలితంతో కమలం పార్టీలో ఆవిరైపోయింది. ఇంట గెలిచి రచ్చగెలవాలి. బీజేపీకి ఇది మింగుడుపడని ఓటమిభారం. దేశరాజధానిలోనే ప్రజల నమ్మకాన్ని ఆ పార్టీ కోల్పోయిందని విపక్షాలకో ప్రచారాస్త్రం దొరికింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లోని 250 వార్డుల్లో సగానికి పైగా గెలుచుకుని తొలిసారి ఆప్ పాగావేసింది. అదే సమయంలో బీజేపీ మరీ దారుణంగా ఓడిపోలేదు. ఆ పార్టీ సెంచరీ కొట్టింది. కానీ విజయానికి పాతికసీట్ల దూరంలో ఆగిపోయింది. ఢిల్లీలో ఆమ్ఆద్మీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగాక పూర్తిగా బలహీనపడ్డ కాంగ్రెస్ కనాకష్టంమీద పదిసీట్లు గెలుచుకుంది. ఢిల్లీలో కొన్నాళ్లక్రితం మతకల్లోలాలు, సున్నిత అంశాలపై వివాదాలు, క్యాంపస్లలో అలజడుల నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తేలిపోయింది.
ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రంలో తనదైన పాలనతో ఆమ్ఆద్మీ పునాదులు పటిష్టం చేసుకుంది. విద్య, వైద్యం, ఇతర సంక్షేమ పథకాల విషయంలో ఢిల్లీ ప్రజలను మెప్పించిన కేజ్రీవాల్ ఎంసీడీలో ఘనవిజయంతో మరింత బలపడ్డారు. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన ఓ ట్రాన్స్జెండర్ని కూడా ప్రజలు గెలిపించారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి కాంగ్రెస్ సీఎం షీలాదీక్షిత్ మూడు కార్పొరేషన్లుగా విభజించారు. ఈ ఏడాదే ఆ మూడు కార్పొరేషన్లనీ విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. 2017 మున్సిపల్ ఎన్నికల్లో 181 సీట్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ, చీపురుకట్ట దెబ్బకి గద్దెదిగక తప్పలేదు.