తూ చీజ్‌ బడా హై మస్క్‌ మస్క్‌!

By KTV Telugu On 7 December, 2022
image

టార్గెట్ జోబైడన్‌.. మస్క్‌ కొత్త స్టాండ్‌
ట్విటర్‌ పిట్ట కూత మారిపోతోంది

ఏ ముహూర్తాన ఎలాన్‌మస్క్‌ ట్విట్టర్‌ని టేకోవర్‌ చేశాడోగానీ అప్పట్నించీ రోజూ సంచలనాలే. ట్విటర్‌ సాక్షిగా గతంలో జరిగిన తెరవెనుక భాగోతాలు కూడా మస్క్‌ జమానాలో వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్‌లో సీనియర్లకి సెండాఫ్‌ ఇచ్చేసి, వేలమంది ఉద్యోగాలు పీకేసిన మస్క్‌ పాతవన్నీ తవ్వుతున్నాడు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్‌కు అనుకూలంగా వ్యవహరించిన ట్విటర్‌ సీనియర్‌ ఉద్యోగిపై ఎలాన్‌ మస్క్‌ వేటుపడింది.
జోబైడెన్‌ కొడుకు హంటర్‌ బైడెన్‌ లీలలపై న్యూయార్క్‌ పోస్టు కథనం కలకలం రేపింది. అయితే ఈ కథనం సోషల్‌ మీడియాలో ప్రచారం కాకుండా ట్విటర్‌ నిలిపేసింది. ఈ నిర్ణయం తీసుకున్న కంపెనీ వెబ్‌సైట్‌ డిప్యూటీ జనరల్‌ కౌన్సిల్‌ జేమ్స్‌ బేకర్‌ని ఎలాన్‌ మస్క్‌ తొలగించాడు. జనం చర్చించుకోవాల్సిన కీలక అంశాన్ని తొక్కిపెట్టిన విషయంలో బేకర్‌ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో సాగనంపినట్లు ఎలాన్‌మస్క్‌ ప్రకటించాడు.
జో బైడన్‌ తనయుడు హంటర్‌ బైడెన్‌ ల్యాప్‌టాప్‌ల నుంచి సేకరించిన సమాచారం విడుదలపై గతంలో ట్విటర్‌లో జరిగిన అంతర్గత సంభాషణలను ఎలాన్‌ మస్క్‌ వారం క్రితం విడుదల చేశారు. 2019 ఏప్రిల్‌లో రిపేర్లకోసం వచ్చిన కొన్ని ల్యాప్‌టాప్‌లను అదే ఏడాది డిసెంబరులో ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకొంది. అప్పటికే ఆ ల్యాప్‌టాప్‌లలోని సమాచారం ట్రంప్‌ సన్నిహితవర్గాల్లోని ఓ లాయర్‌కి చేరిపోయింది. ఆ లాయర్‌ ఇచ్చిన హార్డ్‌డ్రైవ్‌లోని సమాచారాన్ని 2020లో న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. అప్పట్లో ట్విటర్‌ ఈ కథనాన్ని సెన్సార్‌ చేసింది. కథనాన్ని ప్రచురించిన న్యూయార్క్‌ పోస్టు ఎకౌంట్‌ని కొన్నాళ్లు సస్పెండ్‌ చేసింది. అప్పట్లో ట్విటర్‌కి అభ్యంతకరంగా ఉన్న సమాచారాన్ని ఇప్పుడు మస్క్‌ చాటింపేసి మరీ చెబుతున్నాడు. హేవిటో!