మరో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా
భారత్‌పై బంగ్లా సంచలన విజయం
మరో మ్యాచ్ మిగిలుండగానే కప్ కైవసం
టీమిండియా మరో వన్డే సిరీస్ కోల్పోయింది. బంగ్లాపై కీలకంగా గెలవాల్సిన రెండో వన్డేలో రోహిత్ సేన చేతులెత్తేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్ సిరీస్ కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌పై వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన బంగ్లా 2-0తో కప్ గెలుచుకుంది. విరాట్, రాహుల్, ధావన్‌లు ఘోరంగా విఫలమయ్యారు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ ప్లేస్‌లో వచ్చి హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరి వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. బంగ్లానే విజయం వరించింది. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌నూ భారత్ చేజార్చుకుంది.
ఆసియా కప్‌లో అనూహ్య ఓటమి తర్వాత టీమిండియాను కష్టాలు వెంటాడుతున్నాయి. రోహిత్ కెప్టెన్సీలోని భారత్ ఈ ఏడాది ఆరంభంలో వరుసగా సిరీస్ లను నెగ్గింది. ఆసియా కప్ ముందు వరకు విజయాల పరంపర కొనసాగింది. మధ్యలో రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంతలు కూడా భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే ఆసియాకప్‌లో నిరాశపర్చారు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12లో అదరగొట్టినప్పటికీ సెమీస్‌లో చేతులెత్తేసిన పరిస్థితి. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో పాండ్యా సారథ్యంలోని భారత్ టీ 20సిరీస్ గెలుచుకోగా ధావన్ నేతృత్వంలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఇక బంగ్లా టూర్‌కు వెళ్లిన భారత్ ఘోరమైన ఆటతీరుతో అభిమానులను తీవ్ర నిరాశపర్చింది. అంచనాలకు మించి ఎవరూ ఊహించని విధంగా బంగ్లా భారత్‌పై వన్డే సిరీస్‌ను వశం చేసుకుని సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. బుమ్రా, షమీలు లేని స్పష్టంగా కనిపించింది. సిరాజ్, శార్దుల్, ఉమ్రాన్ నిలకడలేని ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో భారత్ తేలిపోతుంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ను 136 పరుగులకే 9 వికెట్లు తీసి కట్టడి చేసింది. చివర్లో ఒక్క వికెట్ తీయలేక భారత బౌలర్లు విఫలం అయ్యారు. రెండో వన్డేలోనూ ఆఖర్లో మరోసారి చేతులెత్తేశారు. తొలుత అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 69 పరుగులకే 4 వకెట్లు కోల్పోయింది. అయితే మహ్ముదుల్లా (77), మెదీ హసన్ మిరాజ్ (100 నాటౌట్) భారత బౌలర్లను చితక్కొట్టారు.
అదే సమయంలో బంగ్లాపై భారత బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి వన్డేలో 41.2ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది రోహిత్ సేన. ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 7 వికెట్లు కోల్పోయి భారత్‌కు 271పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే ఛేజింగ్‌లో రోహిత్ టీమ్ విఫలమైంది. ఐదు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ రెండో వన్డేను గెలుచుకొని కప్ ఎగరేసుకుపోయింది. వచ్చే వన్డే వరల్డ్ కప్‌కు ముందు వరుస పరాజయాలు భారత్‌ను కలవరపెడుతున్నాయి.