కేసీఆర్ ప్లాన్ బీ.. డైరెక్టుగా మోదీని ఆటాక్

By KTV Telugu On 8 December, 2022
image

డ్రాగన్ సాక్షిగా కేసీఆర్ కొత్త అస్త్రాలు ఎక్కుపెట్టారా ? దేశ ప్రజల బతుకులను చైనా వస్తువుతో నింపేశావని అడుగుుతున్నారా ? దేశాన్ని దివాలా తీయించారని విరుచుకుపడుతన్నారా ? జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు రంగం సిద్దం చేసుకుంటున్న తరుణంలో ఇకపై చిన్న లీడర్లను పెద్దగా పట్టించుకోకుండా డైరెక్ట్ గా మోదీపైనే అస్త్రాలు ఎక్కుపెట్టాలని గులాబీ దళపతి డిసైడయ్యారా… ?

బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసే దిశగా అడుగులు
దూకుడు పెంచిన కేసీఆర్
డైరెక్టుగా మోదీనే టార్గెట్ చేస్తున్న గులాబీ బాస్
మేకిన్ ఇండియా ఫెయిల్యూర్ అంటున్న తెలంగాణ సీఎం
సబ్కా బక్వాస్ అంటూ కొత్త నినాదం
కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని ఆరోపణలు
మోదీపై విరుచుకుపడితే జాతీయ స్థాయిలో ప్రచారం ?
ఇతర రాష్ట్రాల నేతలకు విశ్వాసం కలిగించడమే లక్ష్యం

సబ్కా బక్వాస్. ఇదీ మోదీ పట్ల కేసీఆర్ ఎత్తుకున్న కొత్త నినాదం. ఒక సభతో కేంద్ర ప్రభుత్వ స్కీములన్నింటినీ ఆయన తూర్పార పట్టేశారు. అంతా డంబాచారాలు, డాంబికాలు తప్పితే దేశానికి చేసినదేమీ లేదని తేల్చేశారు. ఎన్డీయే ప్రభుత్వ ప్రాథమిక నినాదమైన మేకిన్ ఇండియాను ఆయన తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. జగిత్యాల పర్యటనకు వచ్చిన కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా ఉన్నారు. మోతె మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన స్పీచ్ హైలైట్ అనే చెప్పుకోవాలి. మోదీ తీరుపై కేసీఆర్ వాడీ వేడిగా వాగ్బాణాలు సంధించారు.

మేకిన్‌ ఇండియా అంటే ఏంటి? దేశంలో ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్‌ నిలదీశారు. పిల్లలు కాల్చే పటాకులు, పండుగకు ఎగురవేసే పతంగుల మాంజా దారం, దీపావళికి పెట్టే దీపాంతలు చివరికి మన జాతీయ జెండా కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయని మోదీ పాలనపై మండిపడ్డారు. ‘‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ బక్వాస్‌’’ అని ఎద్దేవా చేశారు. బక్వాస్ అంటే బుకాయింపు అని అనుకోవాలి.

తెలంగాణ వచ్చినప్పుడే మోదీ ప్రధాని అయ్యారని గుర్తు చేస్తూ ఎనిమిదేళ్ల పాలనతో దేశం సాధించిందీ శూన్యమన్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. ఉన్న పరిశ్రమలను తెగనమ్మి సామూహిక ఆస్తులను కరిగిస్తున్నారన్నారు. స్కీముల పేర్లతో ప్రజల సొమ్మును దోచుకుంటారని కేసీఆర్ ఆరోపించారు. మేకిన్ ఇండియా అమలుకాకపోగా యాభై లక్షల ఉద్యోగాలు ఊడాయన్నారు. పది లక్షల మంది వ్యాపారులు దేశం విడిచి వెళ్లారన్నారు. సంపన్నులు దేశం విడిచి వెళ్లడం దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలన్నారు. మోదీ పెంచి పోషిస్తున్న కార్పొరేట్ వ్యవస్థపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఎన్పీఏల పేరుతో కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు. మోటర్లకు మీటర్లు పెట్టి పేదల డబ్బులు దండుకోవాలని చూస్తున్న ప్రభుత్వం కార్పొరేట్లకు రుణమాఫీ చేస్తూ సంపన్నులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

తెలంగాణ అభివృద్దిని ఏ శక్తి ఆపలేదన్నారు. తాను బతికున్నంత వరకు రైతు బంధు భీమా ఆగదన్నారు. పది రోజుల్లో రైతు బంధు నిధులు జమ అవుతాయని హామీ ఇచ్చారు. కొండగట్టు ఆలయ అభివృద్దికి వంద కోట్ల మంజూరు చేసిన ఆయన పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. తెలంగాణ బీజేపీ వారిని గోల్ మాల్ గోవిందం గాళ్లంటూ వారిని తాను లెక్కచేయబోనన్న సందేశం ఇచ్చారు.

కేసీఆర్ ప్రస్తుత వ్యూహమంతా మోదీని టార్గెట్ చేయడంపైనే ఉంది. అందుకు కారణాలు లేకపోలేదు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న వేళ బీజేపీ జాతీయ నాయకులంతా రాష్ట్రానికి క్యూ కడతారని ఆయనకు తెలుసు. వాళ్ల టూర్లు మొదలయ్యే లోపు మోదీని టార్గెట్ చేస్తే తన సందేశం జనంలోకి వెళ్తుందని కేసీఆర్ అంచనా వేసుకుంటున్నారు. ధరల పెరుగుదల, పారిశ్రామిక ప్రగతి మందగించడం దేశం ఎదుర్కొంటున్న ఆర్తిక సమస్యలపై గణాంకాలు చెప్పుకుంటూ పోతే జనానికి ఎక్కదని కూడా గులాబీ దళపతికి బాగానే తెలుసు. అందుకే మోదీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడితే జనం ఆలకిస్తారని తాను చెప్పిన విషయాల్లో సహేతుకత ఉందని విశ్వసిస్తారని కేసీఆర్ ఎదురుచూస్తున్నారు.

కేసీఆర్ కు తెలంగాణలో గెలవడం ఎంత ముఖ్యమో తాను ప్రారంభించిన బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. బీఆర్ఎస్ ఉనికిని చాటాలంటే జాతీయ ప్రధానాంశాలే ప్రస్తావించాలి. లోకల్ పాలిటిక్స్ ను ద్వితీయ శ్రేణి నేతలకు వదిలేస్తూ తాను జాతీయస్థాయిలో బీజేపీని ఇరుకున పెట్టే టాపిక్స్ ఎంచుకోవాలి. అప్పుడు బీజేపీని వ్యతిరేకించే జాతీయ పార్టీలు కూడా తనతో చేయి కలిపేందుకు సిద్ధమవుతాయని కేసీఆర్ అంచనా వేసుకుంటున్నారు. మోదీ పాలన దేశాన్ని అధోగతి పాలు చేసిందని కూడా చెప్పేందుకు ఆయన అవకాశం తీసుకుంటున్నారు. మోదీకి తాను మాత్రమే ధీటైన నాయకుడినని కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ తీరులో మరో సందేశం కూడా ఉంది. కాంగ్రెస్ ను తాను లెక్కచేయడం లేదని అది చచ్చిపోయిన పార్టీ అని తనకు మోదీ ఒక్కరే పోటీ అని చెప్పడం కూడా కేసీఆర్ ఉద్దేశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

జాతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో రాజకీయాలను విశ్లేషించే వారికి కూడా కేసీఆర్ ఒక సందేశం ఇవ్వాలనే అనుకుంటున్నారు. తెలంగాణ నాయకుడికి జాతీయ అంశాలపై పూర్తి అవగాహన ఉందని చెప్పడమే ఆయన డైలాగ్స్ కారణమని అనుకోవాలి. బీఆర్ఎస్ కు ఒక్క ఛాన్సిస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని ప్రజల జీవితాల్లో వెలుగునింపుతానని ఆయన పరోక్షంగా సందేశమిస్తున్నారు. మోదీ వల్ల కాని పనులన్నీ తాను చేస్తానని చెప్పడమే ఆయన మాటల్లో మర్మం. కాకపోతే ఇదొక ఆరంభం. ఇకపై మాటల ఫిరంగులు చాలానే పేలతాయి.