బస్సుయాత్రకు పోరాటరథం సిద్ధం.
ట్రైలర్ రిలీజ్.. త్వరలోనే సినిమా.
ఆధునిక హంగులతో వాహన ఏర్పాట్లు.
మిలటరీ రంగు వాడకంపై వివాదం.
ఏపీలో ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు పోటాపోటీగా జిల్లాలను చుట్టేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో లోకేష్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాను సైతం అంటున్నాడు. బస్సు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన తయారుచేయించిన రథం ఒకటి హల్చల్ చేస్తోంది. వారాహిగా పిలివబడే వాహనం ట్రయిల్ రన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన జనసేన ఓ హైప్ క్రియేట్ చేసింది. వాహనం పక్కనే భద్రతా సిబ్బంది అలా నడచివస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా స్టైల్లో వెహికిల్ ముందు వెనకా సెక్యూరిటీతో కూడిన ట్రైలర్ వదిలింది. వస్తోంది పోరాటరథం అంటూ జనసైన్యం క్యాప్షన్‌లు పెడుతున్నారు. అయితే పవన్ వ్యవహారశైలిపై విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. పవన్ ఇంకా రీల్ లైఫ్‌లో ఉన్నాడని రియాలిటీ నేర్చుకోవాలని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
పవన్ ఏరికోరి తయారుచేయించుకున్న వాహనంపైనే ఇప్పుడంతా చర్చ నడుస్తోంది. వారాహిపై వివాదం రాజుకుంది. యుద్ధం ట్యాంకును తలపించేలా ఆ వాహనం ఉంది. మిలటరీ వాహనం కలర్ వాడడం నిషిద్ధమని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీవైమేనా ఆర్మీ అనుకుంటున్నావా అని పోస్టులు పెడుతున్నారు. మున్ముందు దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఒక రాజకీయ నాయకుడు పవిత్రమైన మిలటరీ రంగు వాడటం పద్దతి కాదని సూచిస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు స్పందిస్తున్నారు. ఆ బండికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదని అది బేస్ పెయింట్ అయ్యుండొచ్చని అంటున్నారు. ఏదైనా తేడా ఉంటే రిజిస్ట్రేషన్ కూడా చెయ్యరని ఆమాత్రం తెలియకపోతే ఎలా అని కౌంటర్ ఇస్తున్నారు.
మొత్తంగా ప్రభుత్వంపై యుద్ధానికి ఓ సైనికుని మాదిరి జనసైనికుడు వస్తున్నాడంటున్నారు జనసైనికులు. ఆర్మీ వాహనానికి సైనికులు తరహాలో పవన్ కొత్త రథం వెంట జనసైనికులు ఉంటారని చెబుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయంగా దూకుడు పెంచుతున్న పవన్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దసరా నుంచే రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ప్రారంభించాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఈ సమయంలో పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లతో ప్రచార రథానికి తుది మెరుగులు దిద్దారు.
పవన్ వాహనం వారాహికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆధునిక హంగులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అందులోనే పవన్ కల్యాణ్ బస చేయనున్నారు. రాత్రి సమయాల్లో సైతం వాహనం నుంచే ప్రసంగాలు కొనసాగించే వీలు కల్పించారు. అదే విధంగా ప్రసంగాలు స్పష్టంగా వినబడేలా మైక్ సిస్టమ్ సిద్దం చేసారు. వారాహి వాహనంలో పవన్ ముఖ్యులతో చర్చించేందుకు వీలుగా ఒక చిన్న మీటింగ్ రూం ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ వాహనాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేయించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభంకానుంది. బస్సుయాత్రకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.