ఎన్నాళ్లీ సాగతీత.. జట్టును జిడ్డులా పట్టుకున్న సీనియర్లు

By KTV Telugu On 8 December, 2022
image

భారత క్రికెట్ జట్టు బాగుపడదా.. సగటు క్రీడాభిమానికి నిరాశ తప్పదా. బంగ్లాదేశ్‌తో కూడా గెలవలేకపోతే ఇక ఆడి ప్రయోజనమేమిటి.. సెలక్టర్లు ఇకనైనా కళ్లు తెరవరా.

ఘోరంగా ఆడుతున్న టీమిండియా
బంగ్లాదేశ్ జట్టుపై సిరీస్ ఓటమి
జట్టు ఆటతీరును జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
బ్యాంటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఫ్లాప్ షో
జట్టును బంకలా పట్టుకున్న కొందరు ఆటగాళ్లు
ఇకనైనా సెలక్టర్ల తీరు మారాలి

బంగ్లాదేశ్ ఒకప్పుడు క్రికెట్‌లో పసికూన. భారత్‌లో స్కూల్ టీమ్‌ కూడా బంగ్లాదేశ్‌ను ఓడిస్తుందని చెప్పుకునే వాళ్లు. అలాంటి జట్టు ఇప్పుడు బాగా రాటు తేలిపోయింది. ఇండియాను ఓడించే స్థాయికి ఎదిగింది. నిజానికి ఇటీవల ముగిసిన టీ -20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఏమంత ఆటతీరును ప్రదర్శించలేదు. తొలి రౌండ్లలోనే పరాజయం పాలైంది. ఇండియా సెమీఫైనల్స్ వరకు వచ్చిందనుకోండి.

కట్ చేసి చూస్తే బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్‌ ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. పోరుగు దేశ జట్టుతో ఇండియా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. హేమాహేమీలు ఉండే జట్టు అని చెప్పుకుంటూ ఇంత ఘోర వైఫల్యం ఏమిటని భారత క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు. హిట్ మ్యాన్లు, కింగ్ కోహ్లీలు ఏమి చేస్తున్నారు. బంగ్లాదేశ్ ను కూడా పడగొట్టలేని బౌలర్లు ఇంకెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెండు మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. సచిన్ తర్వాత అతనే అని చెప్పుకునే భారతీయులను కోహ్లీ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. రెండో మ్యాచ్‌లో కేవలం ఆరు బంతులు ఆడిన కోహ్లీ ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టలేక కెప్టెన్ రోహిత్ మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా సిక్సులు బాదేస్తున్నారు. మొదటి మ్యాచ్ మరీ ఘోరం బంగ్లాదేశ్ వారి ఆఖరి వికెట్ పడగొట్టలేక యాభైకి పైగా పరుగులు సమర్పించి ఓడిపోయారు.

జట్టులో పాతుకుపోయిన క్రికెటర్లు ఆడకపోయినా, ఆడలేకపోయినా తమ ప్లేస్‌పై ఎలాంటి భయం లేకుండా ఉంటున్నారు. ఒక మ్యాచ్‌లో ఆడితే ఐదారు మ్యాచ్‌ల వరకు వారికి ప్లేస్ గ్యారెంటీ అయిపోతోంది. తీసేస్తారేమో అని అనుమానం వచ్చినప్పుడు ఓసారి భారీ స్కోర్ చేస్తారు. అలాంటి వారి వల్ల యంగ్‌స్టర్స్ కు అవకాశం రావడం లేదు. కేఎల్‌ రాహుల్, శిఖర్ ధవన్ సాధించిందేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు జట్టు కూర్పే మార్చాలన్న ప్రతిపాదనకు ఎన్నిరోజులైనా సెలక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పెద్ద ప్లేయర్లుగా ముద్ర పడిపోతే వారికై వారు రిటైర్మెంట్ ప్రకటించే వరకు జట్టు నుంచి తొలగించడం లేదు. అప్పుడెప్పుడో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేశారన్న లెక్కలు చూపుతూ టీమ్ లో కొనసాగిస్తున్నారు.

క్రికెటే మతంగా ఉన్న ఇండియాలో ఓ సారి పేరు వస్తే జనం వారిని దేవుడిగా కొలుస్తారు. ఆ క్రీడాకారుడే పిచ్ పై దిగాలని కోరుకుంటారు. లేకపోతే ఆట ఆగిపోతుందన్నంత గోల చేస్తారు. దానితో ఆటగాళ్లకు కూడా గర్వం నెత్తికెక్కుతుంది. నిర్లక్ష్యం పెరిగి ఆడలేని పరిస్తితి వస్తుంది. ప్రస్తుత దౌర్భాగ్య స్తితికి కూడా అదే కారణం. ఇప్పటికైనా అభిమానుల సెంటిమెంటును పక్కన పెట్టి సెలక్టర్లు జట్టును మార్చాలి. కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే వచ్చే వరల్డ్ కప్ నాటికైనా ప్రతర్థిని సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుంది. లేనిపక్షంలో నమీబియా జట్టు చేతిలో కూడా ఓడిపోయే ప్రమాదముంది.