బీజేపీ గెలిచిందా? కాంగ్రెస్‌ ఓడిందా?

By KTV Telugu On 8 December, 2022
image

గుజరాత్‌లో వార్‌ వన్‌సైడ్‌..ఎందుకిలా?

గుజరాత్‌లో ఏడోసారి కూడా విజయం బీజేపీదేనని ఎగ్జిట్‌పోల్స్‌లోనే తేలిపోయింది. కానీ ఆ అంచనాలకు కూడా మించిపోయింది బీజేపీ ఘనవిజయం. కంచుకోటలాంటి రాష్ట్రంలో తన రికార్డుని తానే బద్దలుకొట్టుకుంది కమలం పార్టీ. ఎక్కడా లెక్క తప్పలేదు. పైగా కొన్ని లెక్కలు కలిసొచ్చాయి. ఆమ్‌ఆద్మీపార్టీ నెత్తిన పాలుపోసింది. ఎంఐఎం పోటీ మరోసారి కమలానికి కలిసొచ్చింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి మిగిలినపార్టీలకంటే బీజేపీనే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సర్వం తామై కలియతిరిగారు. వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను నిర్మొహమాటంగా పక్కనపెట్టారు. పంజాబ్‌లో జాక్‌పాట్‌ కొట్టిన ఆమ్‌ఆద్మీ గుజరాత్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. తాను గెలవలేకపోయినా కాంగ్రెస్ ఓట్లకు భారీగానే గండికొట్టింది. కేజ్రీవాల్‌ కొత్త ఎత్తుగడలతో గుజరాతీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఆయన పాచికలేవీ పారలేదు. అయితే కాంగ్రెస్‌కి సంప్రదాయికంగా పడుతూ వచ్చిన ఓట్లు చాలావరకు ఆమ్‌ఆద్మీకి మళ్లాయి.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ ముందే అస్త్ర సన్యాసం చేసింది. పార్టీ అగ్రనాయకత్వం గుజరాత్‌ ప్రచారం మీద పెద్దగా దృష్టిపెట్టలేదు. బాధ్యతలు తీసుకున్న అశోక్‌గెహ్లాట్‌ మనిషి ఇక్కడున్నా ఆయన మనసంతా రాజస్థాన్‌పైనే. గుజరాత్‌లో ఎంత కష్టపడ్డా పంజాబ్‌ ఫలితమే రిపీట్‌ అవుతుందని కాంగ్రెస్ ముందే ఊహించినట్లుంది. అందుకే చివరిదాకా పోరాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఎన్నికల ముందు కొందరు కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడారు. పాటిదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఓవైపు ఆమ్‌ఆద్మీ, మరోవైపు ఎంఐఎం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చటంతో బీజేపీ ఆడుతూపాడుతూ 150 సీట్ల మార్క్‌ దాటేసింది.
1995 నుంచి గుజరాత్‌లో బీజేపీ విజయం సాధిస్తూనే ఉంది. ఏడుసార్లు గెలిచి పశ్చిమబెంగాల్‌లో సీపీఎం రికార్డును తుడిచేసింది. నరేంద్ర మోదీ చరిష్మా గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసొచ్చింది. గుజరాత్‌ చరిత్రలో ఇంత మెజార్టీతో మునుపెన్నడూ ఏ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. 1985లో కాంగ్రెస్‌ పార్టీ 149 సీట్లు గెలుచుకోవడమే ఇప్పటిదాకా ఉన్న రికార్డు. ఏడోసారి తిరుగులేని విజయంతో బీజేపీ ఆ రికార్డుని బద్దలుచేసింది. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్లు గెలుపుమాదేనన్న కేజ్రీవాల్‌ పార్టీ ఐదారుసీట్లకే పరిమితమైంది.