తిరుమలలో అవినీతి రాజ్యమేలుతోంది.
రమణ దీక్షితులు సంచలన ట్వీట్.
కొంతకాలంగా టీటీడీపై తీవ్ర విమర్శలు.
స్వామివారి సన్నిధిలో స్కామ్‌లా? టీటీడీలో అసలేం జరుగుతోంది. రమణ దీక్షితులు వ్యాఖ్యలను ఏవిధంగా చూడాలి? శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు దీక్షితులు వారు టీటీడీపై కొంతకాలంగా చేస్తున్న ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. తిరుమలలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందంటూ రమణదీక్షితులు మరో బాంబ్ పేల్చారు. శ్రీవారి ఆలయంలో వంశపారంపర్యంగా సేవలందిస్తున్న వారిని తొలగించారంటూ సంచలన ట్వీట్ చేశారు. ఆలయంలో యాదవులు, కుమ్మరులు, ముగ్గులు వేసేవారు, తోటమాలులు, నేత కార్మికులు, వడ్రంగులు, స్వర్ణకారులు ఇలా మొత్తం 54 సంప్రదాయ వంశపారంపర్య కుటుంబాలు స్వామివారికి సేవ చేసేవారిని గుర్తు చేశారు. వీరిని 30/87 చట్టంతో తొలగించారని చెప్పిన దీక్షితులు ఇప్పుడు తిరుమలలో విపరీతమైన అవినీతి మాత్రమే ఉందని ఆరోపించారు.
గతంలో కూడా తిరుమలలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ దీక్షితుల వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్చక వ్యవస్థను నాశనం చేసే లోగా ఆ శక్తులపై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ట్వీట్ కలకలం రేపింది. వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారని అర్చకులు భావించారని ప్రస్తావించారు. ఆ ట్వీట్ తీవ్ర వివాదానికి కారణం కావడంతో కొద్దిసేపటికే డిలీట్ చేశారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలకు టీటీడీలో పనిచేసే పైడిపల్లి, పెద్దింటి , తిరుపతమ్మ, గొల్లపల్లి కుటుంబాలకు చెందిన అర్చకులు కౌంటర్ ఇచ్చారు. రమణదీక్షితులు స్వప్రయోజనాల కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారి కైంకర్యాలను అర్చకులు అందరూ కలిసి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగానే ఉందని, రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు.
గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనూ రమణ దీక్షితులు శ్రీవారి ఆలయానికి సంబంధించి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వామి వారి ఆభరణాల విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. స్వామి వారి పోటులో తవ్వకాలు జరిపినట్టు ఆయన ఆరోపించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా కూడా వేసింది . గత ప్రభుత్వం దాఖలు చేసిన పరువు నష్టం దావాను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతేకాదు ఆగమ శాస్త్ర సలహామండలి సభ్యుడిగా ఉన్న రమణ దీక్షితులుకు ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా అవకాశం కల్పించింది జగన్ ప్రభుత్వం. అయితే గత కొంతకాలంగా దీక్షితులు టీటీడీని ఉద్దేశించి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తిరుమల కొండపై అవినీతి జరుగుతుందోన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.