తమలపాకుతో నువ్వొకటంటే…తలుపుచెక్కతో నేను ఒకటంటా…ఇదీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు సరిపోయే సామెత. పైగా ప్రజల కోసం, ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీని తమలపాకుతో తట్టాలనుకుంటే ఊరుకుంటారా. శిశుపాలుడి 99 తప్పులు క్షమించినట్లుగా ఇంతకాలం సహనం వహించిన సీఎం కేసీఆర్.. ఇక విజృంభించండీ అంటూ సంకేతాలిచ్చేశారు. సారీ నేరుగానే చెప్పేశారు…
ప్రతి పక్షాలు సౌండ్ చేసిన చోట టీఆర్ఎస్ రీ సౌండ్ చేయాలని డిసైడ్ ఐంది. వారు సభలు, పాదయాత్ర లతో హడావిడి చేసిన జిల్లాల్లో అధికార పార్టీ యాక్టివిటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల విమర్శలను గ్రౌండ్ లోనే తిప్పికొట్టే భాధ్యతను కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించారు గులాబీ బాస్ కేసిఆర్. దాంతో రాహుల్ సభ పెట్టిన వరంగల్, బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లాల పై కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు..
ఎన్నికలు ఏడాది పైగా ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయ వాతావరణం అప్పుడే హీటెక్కింది. అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టీ గ్రామాలు చుట్టేస్తున్నరు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా హాజరై కేసిఆర్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఇక ఇటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రావడం, వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించటం అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. రెండు జాతీయ పార్టీ లు టీఆర్ఎస్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేయటం, డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ తెలంగాణ ను దోచుకుతింటున్నారని ఆరోపణలు చేయటం పై టీఆర్ఎస్ రగిలి పోతోంది. ప్రతిపక్షాల విమర్శలను అంతే గట్టిగా తిప్పికొట్టాలని కారు పార్టీ డిసైడ్ అయింది.
గతంలో జరిగిందీ వేరు.. ఇక జరగాల్సిందీ వేరు అన్నట్లుగా టీఆర్ఎస్ ప్రవర్తిస్తోంది. ప్రకటనలు, ప్రెస్ మీట్లు కొనసాగిస్తూనే కొత్త రూటు కూడా వెదికింది. ప్రతిపక్షాలు సభలతో సందడి చేస్తున్న జిల్లాలకే వెళ్లి అక్కడే వారికి తగిన సమాధానం చెప్పాలని కేసిఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. దాంతో ఇప్పుడు మంత్రులు నియోజక వర్గాల బాట పడుతున్నారు… ఇప్పుడా బాధ్యతను టీఆర్ఎస్ కీలక నేతలైన మంత్రులు
కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించారు కేసిఆర్. దాంతో వారు నియోజక వర్గాల బాట పట్టారు. నువ్వేక్కడికెలితే మేము అక్కడికి వస్తాం అన్నట్లుగా ప్రతిపక్ష నేతలు వెళ్లిన జిల్లా టూర్లకు ప్లాన్ చేసి వెళుతున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ కు వచ్చి వెళ్లిన మర్నాడే కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో పర్యటిం చారు. పరకాల వెళ్లి సభ పెట్టీ రాహుల్ గాంధీ పై ఘాటు విమర్శలు చేశారు. ఇక మంత్రి హరీష్ రావు సైతం ఉమ్మడి వరంగల్ లోని భూపాలపల్లి వెళ్లి ప్రతిపక్షాలను తూర్పార పట్టారు. మరో వైపు కేటీఆర్ బీజేపీ నేతలు పర్యటిస్తున్న ఉమ్మడి మహబూబ్ జిల్లాలోని నారాయణ పేటలో పబ్లిక్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. బీజేపీని టార్గెట్ చేశారు. ఇలా ఇప్పుడు ప్రతిపక్షాలను జీరో చేసే వ్యూహాలను అమలు చేయబోతున్నారు.