బెంగాల్‌లో 34ఏళ్లపాటు సీపీఎం అధికారం
కమ్యూనిస్టుల రికార్డుకు చేరువగా గుజరాత్ బీజేపీ
సిక్కిం, త్రిపుర, ఒడిశాలోనూ ఇదే తరహా రాజకీయం
ఐదేళ్లు పరిపాలించి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎంతోగానో చెమటోడ్చాలి. అలాంటిది కొన్ని దశాబ్దాల పాటు ఏలే అవకాశమొస్తే, మాటలకతీతం. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ప్రజావ్యతిరేకతను దాటుతూ అధికారాన్ని నిలబెట్టుకోవడమంటే మాటలు కాదు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. కొన్ని కాలక్రమేనా తమ ఉనికిని కోల్పోతుంటే మరికొన్ని పార్టీలు మాత్రం ఆయా రాష్ట్రాల్లో ఏళ్లతరబడి పరిపాలన సాగిస్తున్నాయి. అది ఎలా సాధ్యమవుతుంది. దేశ రాజకీయాల్లో ఓ పార్టీ రెండు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఎలా ఉండగలుగుతుంది. అంటే దాని వెనుక ఉన్నది ప్రజలే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలకు మేలు చేస్తే ఏళ్ల తరబడి ఏలేందుకు అవకాశం ఇస్తారు. అందుకు ఎన్నో ఉదాహరణలు మన కళ్లముందు కనబడుతున్నాయి. ఒకప్పుడు త్రిపుర, సిక్కింలలో ఇటువంటి పరిణామం చూడగా తాజాగా గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ఈ తరహా రాజకీయం కొనసాగుతోంది. దేశంలో దశాబ్దాల తరబడి పరిపాలన సాగించిన ప్రభుత్వాలేంటో ఓ సారి చూస్తే.
తాజాగా వెలువడిన గుజరాత్ ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. సరికొత్త రికార్డ్‌లు నెలకొల్పింది. వరుసగా 7సార్లు విజయఢంకా మోగించింది. బెంగాల్‌ను 34ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన సీపీఎం రికార్డుకు గుజరాత్ బీజేపీ చేరువవుతోంది. ఇప్పటికే 27 ఏళ్లు గుజరాత్‌లో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ మరో ఐదేళ్ల పాలనకు మార్గం సుగమం చేసుకుంది. గుజరాత్‌లో కేశూభాయ్ పటేల్ నేతృత్వంలో 1995లో కాషాయపార్టీ తొలిసారి అధికారం చేపట్టింది. తొలినాళ్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ నిలదొక్కుంది. 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ అప్పటినుంచి నేటివరకు వెనక్కి తిరిగి చూడలేదు. 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తనదైన వ్యూహాలతో గుజరాత్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, విద్యుత్ రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్రంలో మోదీ ఛరిష్మా పెరిగిపోయింది. అలా గుజరాత్‌లో 2001లో మొదలైన భాజపా విజయ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ ఎత్తుగడల ముందు ఏ పార్టీ గుజరాత్‌లో నిలవలేకపోతోంది.
స్వతంత్ర భారత దేశంలో సుదీర్ఘకాలం పాటు ఓ రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ నిలిచింది. 1994లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పవన్ కుమార్ చామ్లింగ్ వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 24 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. దేశంలో అత్యధిక కాలం ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగానూ చామ్లింగ్ నిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో చామ్లింగ్ సీఎం పీఠానికి దూరమయ్యారు. 1960, 70వ దశకంలో రాజకీయ అస్థిరతను ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్‌కు జ్యోతిబసు మార్గదర్శిగా నిలిచారు. 1977లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 23 ఏళ్లపాటు పాలించిన నేతగా రికార్డు సృష్టించారు. 2000లో ఆయన బాధ్యతల నుంచి వైదొలగగా బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో పదేళ్లు అధికారాన్ని నిలబెట్టారు. అలా బెంగాల్‌ను 34ఏళ్లపాటు పాలించి కమ్యూనిస్టులు రికార్డు నెలకొల్పారు.
మూడు దశాబ్దాల పాలనలో ప్రజాఉద్యమాలు మొదలైన వేళ దీదీ రంగ ప్రవేశం చేశారు. ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకొని కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. 2011లో ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లోనూ విపక్షాల విమర్శలు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ మూడోసారి ఘనవిజయం సాధించారు దీదీ. ఒకే పార్టీ వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోన్న రాష్ట్రాల జాబితాలో ప్రస్తుతం ఒడిశా కూడా ఉంది. బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఇప్పటివరకు ఐదుసార్లు వరుసగా విజయం సాధించారు. 2000లో 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ ఇప్పటికీ విజయవంతమైన పాలన సాగిస్తున్నారు. ఒడిశాను అభివృద్ధి పథంలో నడిపించడంలో నవీన్ పట్నాయక్ సఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. త్రిపుర కూడా రెండు దశాబ్దాలపాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచింది.