పార్టీని నడపాలి. నడపాలంటే రోజూ ఏదోక కార్యక్రమం ఉండాలి. ప్రతిపక్షంలో ఉంటే.. ప్రభుత్వంపై రోజు వారి ఆరోపణలు చేయాలి. జనంలో ఉండాలి. జనంతో ఉండాలి. తదుపరి అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకుంటూ ఉండాలి. అదీ రొటీన్ గా జరగాల్సిన విషయమే.. అయినా కొన్ని పార్టీలు మాత్రం ఈ సూత్రాన్ని అవసరానికి మించి వాడుకుంటున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ బీజేపీని ప్రధానంగా ప్రస్తావించక తప్పదు. మాటలు కోటలు దాటుతూ ప్రజాబలం గుమ్మం దాటని పార్టీ ఏదైనా ఉందంటే అదీ ఏపీ కమలమేనని నిస్సందేహంగా చెప్పొచ్చు…..
ప్రభుత్వం మీద, తోటి విపక్షాల మీద సమానంగా విరుచుకుపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అదీ బీజేపీనే. బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయని కూడా చెప్పక తప్పదు. ఒక వర్గం చాప కింద నీరులా వైసీపీని సమర్థిస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడుతుంది. మరో వర్గం అవసరాన్ని బట్టి పొత్తు పెట్టుకునేందుకు అంచనాలు వేస్తూ… అవకాశం కోసం నిరీక్షిస్తోంది. రెండు వర్గాలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. తోటి రాష్ట్రం తెలంగాణలో బీజేపీ నేతలు పాదయాత్రలు చేస్తూ జనంలో ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది….
గత ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమంత సంతృప్తికరంగా లేదు. ఏ అభ్యర్థి ఇష్టం లేదంటూ వేసే నోటా కంటే ఆ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. 25 లోక్సభ స్థానాల్లో కలిపి నోటాకు 1.5 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీ ఓట్ల షేరింగ్ కేవలం 0.96 శాతం మాత్రమే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. 175 స్థానాల్లో కలిపి నోటా మీటకు 1.28 శాతం ఓట్లు పోలవగా.. బీజేపీ 0.84 శాతం మాత్రమే సాధించగలిగింది. 2019లో తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థి బి. శ్రీహరి రావుకు 16,125 ఓట్లు రాగా.. నోటాకు 25,781 ఓట్లు పడ్డాయి. అయితే తర్వాత జరిగిన ఉప ఎన్నికలో మాత్రం జనసేన మద్దతు కారణంగా బీజేపీ పరిస్తితి కొంత మెరుగు పడి 50 వేలకు పైగా ఓట్లు సాధించగలిగింది.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అయోమయ ప్రకటనలు ఇవ్వడంలో నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు. కోస్తాంధ్రలో బలమైన సామాజిక వర్గం నేతగా ఆయనకు పార్టీ పదవి రాగా, తన పరపతిని ఉపయోగించి బీజేపీని అభివృద్ధి చేయాల్సిన తరుణంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారు చేశారు. జనసేనతో పొత్తు ఉంటుందని అంటారు. జనసేన, టీడీపీ మైత్రీ సంగతి వాళ్లనే అడగాలని ఆయన అంటారు. వైసీపీని ఓడించాలంటే విపక్షాలన్నీ కలిసి నడవాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపులో ఉన్న క్లారిటీ ఆయనకు అర్థమైనట్లుగా ఎవరికీ అనిపించడం లేదు. చంద్రబాబుతో ఏవో వ్యక్తిగత సమస్యలున్నట్లుగా ఆయన ప్రవర్తిస్తుంటారు రాష్ట్రంలో చిన్న పార్టీగా ఉన్న తాము అనుకున్నది సాధించాలంటే సర్దుకుపోవాల్సిన తరుణమిదేనని ఆయన అర్థం చేసుకోవడం లేదు…
అధిష్టానం చిన్న చూపు
మొదటి నుంచి బీజేపీకి ఉత్తరాది పార్టీ అన్న పేరు ఉండనే ఉంది. దక్షిణాదిన కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో పార్టీ బలపడినదే లేదు. ఎంత ఏకాగ్రత చూపినా అక్కడ సమయం వృధా అవుతోందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. నిధులు చొప్పించి, జాతీయ నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి వారిని ఊరూరా తిప్పినా పది ఓట్లు రావడం లేదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నేతలను చూసినప్పుడు నోటా సే భీ ఛోటా అంటూ ఉత్తరాది బీజేపీ నేతలు జోకులు వేస్తున్నారట. ఇప్పటికైనా ఆ సంగతి అర్థం చేసుకుని సోము వీర్రాజు లాంటి నేతలు కష్టపడి పనిచేస్తూ, భావసారూప్య పార్టీలతో చేతులు కలిపితే బావుంటుందేమో….