కాంగ్రెస్‌కు ఎంపీ గుడ్‌బై చెబుతారా..?

By KTV Telugu On 9 December, 2022
image

రాజకీయాలకు దూరంగా ఉన్నా
ఏ పార్టీలో చేరాలో..ఎన్నికల ముందు డిసైడ్ చేస్తా
పార్టీ మార్పుపై ఎంపీ వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దారెటు? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? తిరుమల స్వామి వారి సన్నిధిలో వెంకన్న చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ మార్పుపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఏ పార్టీలో చేరాలనే విషయం ఎన్నికలకు నెల ముందు డిసైడ్ అవుతానంటున్నారు. ప్రస్తుతానికి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్‌లో ఎక్కువ నిధులు సాధించుకున్న ఎంపీని తాను మాత్రమేనన్న వెంకట్ రెడ్డి ఎన్నికల వరకు నియోజకవర్గం అభివృద్ధిపై మాత్రమే దృష్టిపెడాతనని చెబుతున్నారు.

హైకమాండ్ టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించడంతో వెంకట్ రెడ్డి గుస్సా అయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారారు. కొందరు తనను పార్టీలోంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారంటూ సమయం దొరికినప్పుడల్లా రేవంత్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రాణమున్నంతవరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానంటున్నారు. కానీ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. మునుగోడు బైపోల్ సమయంలో తన సోదరుడిని గెలిపించాలంటూ వెంకట్ రెడ్డికి సంబంధించిన ఆడియో ఒకటి బయటకొచ్చింది. తాను పోటీ చేసినా కాంగ్రెస్ గెలవదంటూ అప్పట్లో వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో పెను దుమారమే రేపాయి. దీనిపై హైకమాండ్ నుంచి రెండుసార్లు వెంకట్‌ రెడ్డికి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. అయితే ఆ వ్యాఖ్యలు తనవి కాదని మార్ఫింగ్ చేశారని కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు.

మునుగోడు ఉపఎన్నిక తదనంతర పరిణామాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వెంకట్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ పదవి ఊడుతుందని ఆ దెబ్బతో తనకు పీసీసీ వస్తుందని వెంకట్ రెడ్డి భావించారట. అప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానంటూ ఆయన కార్యకర్తలకు చెప్పినట్టుగా ఉన్న వాయిస్ ఒకటి బాగా వైరల్ కూడా అయ్యింది. ముందే పసిగట్టిన రేవంత్ కొందరు కేసీఆర్‌తో కుమ్మక్కై కాంగ్రెస్‌ పార్టీపై కుట్ర చేస్తున్నారంటూ కన్నీరుపెట్టారు. వెంకట్‌రెడ్డి టార్గెట్‌గానే రేవంత్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వెంకట్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహంతో ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన్ను దూరం చేసుకునేందుకు సాహసం చేయలేకపోతోందట. ప్రస్తుతం పార్టీలో సైలెంట్ అయిపోయిన వెంకట్ రెడ్డి రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.