వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఏడాది జైలు శిక్ష

By KTV Telugu On 9 December, 2022
image

కొత్త చట్టం తెచ్చిన ఇండోనేషియా పార్లమెంట్
పర్యాటక రంగానికి మంచిది కాదంటోన్న నిపుణులు

ఇండోనేషియా పార్లమెంట్ నిన్న కాక మొన్ననే ఓ కొత్త చట్టాన్ని ఆమోదించింది. దాని ప్రకారం వివాహేతర లైంగిక సంబంధాలపై నిషేధం అమల్లోకి వస్తుంది. అంటే భార్యా భర్తల మధ్యనే లైంగిక సంబంధాలకు అనుమతి ఉంటుంది. దంపతులు కాని వారు సహజీవనాలు చేసినా సరసాలు చేసినా అమాంతం పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. ఆ తర్వాత న్యాయస్థానాలు ఏడాది పాటు జైల్లో కూర్చోమని తీర్పు చెబుతాయి. భార్యాభర్తలు కానివారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం అంటే వ్యభిచారంతో సమానమే అని అక్కడి పాలకులు భావిస్తున్నారు. ఈ చట్టం దేశ పౌరులతో పాటు ఇతర దేశాల నుండి తరలి వచ్చి దేశంలో ఉంటోన్న వారికీ వర్తిస్తుందని చట్టంలో పేర్కొన్నారు. పర్యాటక వీసాలపై వచ్చే వారు కూడా ఈ చట్టానికి కట్టుబడి ఉండాలి.

ఇండోనేషియా సంస్కృతిని , సంప్రదాయాలను వైవాహిక వ్యవస్థ విలువలను కాపాడేందుకోసమే ఈ కొత్త చట్టం తెస్తున్నట్లు పాలకులు చెప్పుకొచ్చారు. అయితే పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై ఎలాంటి నిషేధాన్నీ విధించలేదు.
అయితే ఈ చట్టం ఇపుడు రాత్రికి రాత్రే అమల్లోకి రాదు. మూడేళ్ల తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. ఈ లోపు చట్టం అమలుకు సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు శిక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తారు. ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే ఇంటా బయటా రెండు రకాల స్పందనలు లభించాయి. దేశంలో పర్యాటక మంత్రిత్వ శాఖలోని వారయితే ఈ చట్టం దేశ పర్యాటక రంగానికి శరాఘాతమే అని అంటున్నారు. ఇటువంటి చట్టం మనకి ఏమాత్రం మంచిది కాదని వారు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇండోనేషియాకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే. వివిధ దేశాల నుండి ఇండోనేషియా రాజధాని బాలికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారి ప్రాధమిక హక్కుకు ఈ చట్టం భంగం కలిగిస్తుందన్నది నిపుణుల వాదన.

అదే జరిగితే పర్యాటకుల ఇండోనేషియా రావడమే తగ్గించుకుంటారని ఇండోనేషియా పర్యాటక శాఖ మంత్రి మౌలానా యూస్రాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు తగ్గితే ఆదాయం కూడా పడిపోతుందని ఆయన చెబుతున్నారు. ఇది దేశానికి చాలా నష్టాన్ని తెస్తుందని అంటున్నారు. కరోనా మహమ్మారికి ముందు ఏటా 60లక్షల మందికి పైగా విదేశీయులు ఇండోనేషియాకు పర్యాటకులుగా వచ్చేవారు. వారి రాకతో ఇండోనేషియాలో చాలా మందికి ఉపాధి దక్కడమే కాకుండా హోటల్ పరిశ్రమకూ లాభాలు వస్తాయి. కరోనా సంక్షోభం నుండి ఇప్పటి వరకు ఇండోనేషియా కోలుకోలేదు. ఇపుడిపుడే పర్యాటకులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నారు. 2025 నాటికి తిరిగి కరోనాకు ముందున్న వైభవం తిరిగి వస్తుందని పర్యాటకులు 70 లక్షలకు చేరుకోవచ్చని అధికారులు అంచనాలు వేసుకుంటోన్న తరుణంలో ఈ చట్టం పిడుగులా మీద పడింది.

ఇండోనేషియాకు అత్యంత మిత్ర దేశమైన అమెరికా ఈ చట్టాన్ని నిశితంగా గమనిస్తోంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తున్నామని అమెరికా అంటోంది.ఇండోనేషియా పత్రికలయితే ఈ చట్టాన్ని ఏకి పారేశాయి. ఇదేం దిక్కుమాలిన చట్టం? వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా చట్టం తెస్తే దేశానికి ఎవరైనా వస్తారా అసలు? అని అవి ప్రశ్నిస్తున్నాయి.ఈ విషయంపై ఏకంగా సంపాదకీయాలే రాశాయి. ఇది ఇండోనేషియాకు నష్టదాయకమే కాదు మరణశాసనం అని ఓ పత్రిక తీవ్రమైన వ్యాఖ్యే చేసింది. భిన్న సంస్కృతులు, జాతులు ఉన్న దేశంలో ఇటువంటి చట్టం తీసుకురావడం నిరంకుశమే అవుతుందని హక్కుల నేతలు దుయ్యబడుతున్నారు. అయితే ఇండోనేషియా పాలకులు మాత్రం ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుందని తెలిసినా విలువలను కాపాడుకోవడం కోసం ఓ మంచి నిర్ణయాన్నిసాహసోపేతంగా తీసుకోక తప్పింది కాదంటున్నారు. ముక్కు మూసుకుని ఈ చట్టానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అంటున్నారు. మూడేళ్ల తర్వాత అమల్లోకి రానున్న ఈ చట్టానిఇక సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయనేది కాలమే చెప్పాలి.