భారత్ రాష్ట్ర సమితికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

By KTV Telugu On 9 December, 2022
image

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం కార్యక్రమం
ఇక ఢిల్లీ బాటపట్టనున్న కేసీఆర్‌

గుజరాత్‌లో బీజేపీ బంపర్ మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న రోజునే టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌ గా ఆమోదిస్తూ ఎన్నికల సంఘం నుంచి సీఎం కేసీఆర్‌కు అధికారిక లేఖ రావడం విశేషం. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. భారత రాష్ట్ర సమితిగా మారింది. ఇకనుంచి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సమయం వచ్చేసినట్లే. ప్రాంతీయ పార్టీగా అధినేతగా మొదలైన కేసీఆర్‌ ప్రస్థానం ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మారుస్తూ ఈసీ ఆమోదం తెలిసింది. దీనికి సంబంధించి సీఈసీ నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో డిసెంబర్ 9న మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడే కేసిఆర్ బీఆర్‌ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గసభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకాబోతున్నారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని కేసిఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయం కోసం సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని 5వ నెంబరు బంగళాను అద్దెకు తీసుకున్నారు. ఆ భవనాన్ని ఏడాది కోసం లీజుకు తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి గతంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అది పూర్తవగానే అద్దె భవనం నుంచి నూతన భవనానికి కార్యాలయాన్ని మార్చాలనుకుంటున్నారు.