గుజరాత్ ఎన్నికల గెలుపు తెలంగాణ బీజేపీకి కూడా కొత్త ఊపిరినిచ్చిందా. కేసీఆర్ పై ఆటాక్ పెంచాలని అధిష్టానం ఆదేశించిందా. విజయావకాశాలను పెంచుకునేందుకు పార్టీ ప్రయత్నిస్తుందా. ఇకపై బీఆర్ఎస్ ను బండి సంజయ్ కామెడీ చేస్తారా.
గుజరాత్ తర్వాత దక్షిణాదీపై కమలం చూపు.
తెలంగాణలో విజయమే లక్ష్యంగా పావులు.
విజయావకాశాలున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి.
ఆపరేషన్ ఆకర్ష్ కు ఊపు.
కేడర్ బలం పెంచుకునే ప్రయత్నం.
రాష్ట్రానికి అదనపు ఇంఛార్జ్ లు.
గుజరాత్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచబోతోంది. ముందుగా ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రల్లో విజయ దుందుభి మోగించిన ఆ పార్టీ తాజాగా గుజరాత్ విజయం తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగింది. పంజాబ్, హిమాచల్ పరాజయాన్ని మరిచిపోయేందుకు గుజరాత్ గెలుపు టానిక్ లా పనిచేసే నేపథ్యంలో ఇక దక్షిణాది వైపు చూడబోతోంది. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, తెలంగాణలో కేసీఆర్ చేతిలో ఉన్న అధికారాన్ని లాక్కోవడమనే జంట లక్ష్యాలతో ఆ పార్టీ ముందుకు కదులుతుంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తాయి. డిసెంబరు, జనవరిలో దీనిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఫిబ్రవరి, మార్చ్ అంటూ ఎన్నికల తేదీలపై లీకులు కూడా రావడంతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుజరాత్ తర్వాత తెలంగాణ విజయం ఖాయమని డీకే అరుణ లాంటి నేతలు కుండబద్దలు కొడుతున్నారు..
బీజేపీ గత అనుభవాలను, వర్తమాన రాజకీయాలను బేరీజు వేసుకుంటూ విజయానికి బాటలు వేసుకోవాలనుకుంటోంది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది. తర్వాతే పార్టీ క్రమంగా బలం పుంజుకుంటూ వస్తోంది. దుబ్బాలో రఘనందన్ రావు గెలుపు ఆ తర్వాత ఈటల రాజేందర్ కాషాయ దళంలో చేరడంతో ఆ పార్టీకి మరింత ఊపు వచ్చింది. రాజేందర్ బీజేపీలో చేరడమే కాదు హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచి కమలానికి బలం పెంచారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కేవలం పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మునుగోడు పరిణామాలు పార్టీలో ఐక్యతను చాటాయి.
నూతన సంవత్సరంలో బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి రావాలనుకున్న నేతలను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేసేందుకు ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ పనిచేస్తోంది. మరో పక్క త్వరలోనే ప్రజా సంగ్రామ యాత్రను ముగించే టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెడతారు. కేసీఆర్ పై పూర్తి స్థాయిలో విరుచుకుపడే బాధ్యతను పార్టీ అధిష్టానం సంజయ్ కు అప్పగించినట్లు భావిస్తున్నారు.
సంస్థాగత నిర్మాణంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల బలాన్ని పెంచాలనుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు మూడు నెలల కంటే తక్కువ వ్యవథిలో ఆ పని పూర్తి కావాలని బండి సంజయ్ భావిస్తున్నారు. రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు ఇప్పుడున్న కేంద్ర ఇంఛార్జ్ లతో పాటు ఒకరిద్దరు అదనపు ఇంఛార్జ్ లను కూడా పంపించనున్నారు.
రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా పరిగణిస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఖచితంగా గెలిచే నియోజకవర్గాలు మొదటి జాబితా అయితే, కాస్తైనా ఛాన్సున్న నియోజకవర్గాలు రెండో జాబితా. గెలిచే అవకాశాలే లేని నియోజకవర్గాలు మూడో జాబితా. నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మూడు జాబితాలను రూపొందించాలనుకుంటుండగా ఖచితంగా గెలిచే నియోజకవర్గాలు 15 నుంచి 20 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో కేడర్ శూన్యమనే చెప్పాలి. పట్టుమని వెయ్యి మంది కార్యకర్తలు కూడా లేని నియోజకవర్గాలున్నాయి. అక్కడ నేతలను చేర్చుకుని వారి కేడర్ ను తమకేడర్ గా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంతగా ఓట్లుు చీలితే అది తమకు అంతగా ప్రయోజనకరమని బీజేపీ భావిస్తోంది. పార్టీ నేతలు చెబుతున్న మాట మాత్రం ఒక్కటే. సమయం లేదు మిత్రమా.. విజయమా… పరాజయమా అని.