తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు ! మరోసారి కేసీఆర్ ప్రయత్నాలు ?

By KTV Telugu On 12 May, 2022
image

తెలంగాణ అసెంబ్లీ సీట్లను పెంచేలా ప్రయత్నాలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత అక్కడ డీలిమిటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. డ్రాఫ్ట్ సిద్ధమయింది. కేంద్రం ఆమోదిస్తే అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది. విభజన చట్టంలో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అసెంబ్లీ సీట్ల విభజన చేయలేదు. దీంతో కేసీఆర్ కశ్మీర్‌ను చూపించి తెలంగాణనూ అసెంబ్లీ సీట్ల పెంపు కోసం పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

సీట్లు పెంచాలని విభజన చట్టంలోనే ఉంది !

ఏపీ విభజన చట్టం ప్రకారం… తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం.. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి పెరగాల్సి ఉంది. తెలంగాణలో 153 కి చేరాల్సి ఉంది. కానీ.. కేంద్ర ప్రభుత్వం దానికి ఎన్నో అడ్డంకులు చెప్పి.. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. దాంతో.. చట్టంలో ఉన్నా.. అసెంబ్లీ సీట్లు పెరగలేదు. కానీ.. ఇప్పుడు… పునర్‌వ్యవస్థీకరణ చేయకూడదని.. చట్టంలో ఉన్నప్పటికీ.. కశ్మీర్ విషయంలో మాత్రం.. చట్టాన్ని మార్చీ మరీ.. అసెంబ్లీ సీట్లను మార్చింది కేంద్రం.

చట్టాన్ని మార్చి మరీ కశ్మీర్‌లో డీలిమిటేషన్ !

నిజానికి 1992-95 ప్రాంతంలో జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఇందులో జమ్మూకి 37 అసెంబ్లీ స్థానాలు, కశ్మీర్‌కు 46, లడక్‌ డివిజన్‌ నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫరూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం 2002లో ఓ కీలక చట్ట సవరణ తీసుకొచ్చారు. 2026 వరకు జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన చేయొద్దని చట్టాన్ని సవరించారు. అన్ని రాష్ట్రాలతో పాటే 2026లోనే కాశ్మీర్‌లోనూ నియోజకవర్గాలను విభజించాలని చట్ట సవరణలో పేర్కొన్నారు. కానీ కేంద్రం ముందుకే వెళ్లింది. కశ్మీర్‌లో.. డీలిమిటేషన్ చేయకూడదని చట్టం ఉన్నా.. కేంద్రం.. తమ వద్ద ఉన్న బలంతో.. దానికి బదులు కొత్త చట్టం చేసి మరీ నియోజకవర్గాలు పెంచింది.

తెలుగు రాష్ట్రాల సీట్లు పెంచడానికీ అవకాశం !

గత ఏడేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు కూడా డిలిమిటేషన్‌ కమిషన్‌ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 ప్రకారం.. 2001లో చేపట్టిన 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్‌సభ సీట్ల పునర్విభజనను ఫ్రీజ్‌ చేసి పెట్టారు. 2031లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్ల విభజన చేపట్టాల్సి ఉంది. అప్పటివరకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల విభజన కూడా స్తంభించిపోతుందన్న అభిప్రాయాలున్నాయి. కానీ, జనగణనతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచుకునే అవకాశం ఉంది.

జమ్మూకశ్మీర్‌ సీట్ల పెంపుపై కోర్టు తీర్పుతోనే క్లారిటీ !

కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదనపై కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీనిపై ఈ నెల 13న విచారణ జరగనుంది. ఆ సందర్భంగా సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కోర్టుకు ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. సీట్ల పెంపునకు కోర్టు తీర్పు అనుకూలంగా వెలువడితే.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిమాండ్లు పెరుగుతాయి. అవసరం అయితే న్యాయపోరాటం చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు