రాజ‌కీయ‌ యుద్ధ‌మంటే బుల్లెట్‌ప్రూఫ్ బండి కాదెహె!

By KTV Telugu On 9 December, 2022
image

వ‌న్ టూ త్రీ.. రెడీ కెమెరా యాక్ష‌న్‌.. నో రియాక్ష‌న్‌!
ప్ర‌చారానికో వాహ‌నం చాలు… ట్యాంక‌ర్లెందుకు?

యుద్ధానికి సిద్ధం కావాలని వైసీపీ శ్రేణుల‌కు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపు ఇస్తున్నారు. వైనాట్ 175 టార్గెట్‌తో విప‌క్షాల‌కు స‌వాలు విసురుతున్నారు. ఈ స‌వాలు విస‌ర‌డానికి ఆయ‌న శిర‌స్త్రాణం ధ‌రించ‌లేదు. చేతిలో క‌త్తీడాలు ప‌ట్టుకోలేదు. రాజ‌కీయ‌మ‌నేది బుద్ధిబ‌లంతో చేయాలే త‌ప్ప కండ‌బ‌లంతో కాదు. పార్టీ పేరులోనే సేన‌ని పెట్టుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టిలో యుద్ధ‌మంటే క‌త్తులు, బ‌ల్లాలు, విల్లంబులేనేమో. ఆయ‌న ప్ర‌చార ర‌థం ఉక్రెయిన్‌మీద దాడికి బ‌య‌లుదేరిన ర‌ష్య‌న్ ట్యాంక‌ర్‌లా ఉంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వారియ‌ర్ వెహిక‌ల్ రిలీజ్‌కి టీజ‌ర్ కూడా.

వెహిక‌ల్ అదుర్స్‌. ఎవ‌ర‌న్నా రాళ్లేసినా ఏమీ కాదు. అంత స్ట్రాంగ్‌గా ఉంది. అవ‌స‌ర‌మైతే బారికేడ్ల‌ను కూడా తొక్కేసుకుంటూ ముందుకెళ్లిపోవ‌చ్చు. ఎవ‌ర‌న్నా ప్ర‌చార ర‌థ‌మంటే పార్టీ రంగు, సింబ‌ల్‌, పైన నాలుగు లైట్లు, రెండు మైకుల‌తో సింపుల్‌గా ఉంటుంది. కానీ సాదాసీదాగా రోడ్డుమీదికొస్తే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుక‌వుతాడు? కుద‌ర‌క కాస్త కుదురుగా ఉన్నాడేగానీ లేక‌పోతే గ‌బ్బ‌ర్‌సింగ్‌లా తుపాకీచేతిలో ప‌ట్టుకుని గాల్లోకి ఫైరింగ్ చేస్తూ జ‌నంలోకి వెళ్లేవాడేమో. ఎక్కువ దూరం స్వారీ చేస్తే న‌డుం ప‌ట్టేస్తుంద‌నేగానీ గుర్రంమీదే వ‌చ్చేసేవాడు.

రాజ‌కీయ‌భాష‌లో యుద్ధ‌మంటే కేడ‌ర్‌ని మాన‌సికంగా సిద్ధంచేయ‌డం. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వాళ్ల మంచీచెడ్డా చూడ‌టం. ఏద‌న్నా వ్య‌తిరేక‌త ఉంటే దాన్ని దూరంచేసేలా ఇప్ప‌ట్నించే అన్ని ప్ర‌య‌త్నాలు చేయ‌డం. భారీ వాహ‌నం, మందీమార్బ‌లం కాదు రాజ‌కీయ‌మంటే. ఫ్యాన్స్ విజిల్స్ వేయ‌డానికి, స్పీచ్ కూడా వినిపించ‌కుండా సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తించ‌డానికి ఈ క‌టౌట్ ప‌నికొస్తుందేత‌ప్ప జ‌నంలో మ‌న బ‌లం పెర‌గ‌దు. ప్ర‌జారాజ్యం ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో కూడా చిరంజీవి సినిమా టీజ‌ర్ రిలీజ్ చేసినంత హ‌డావుడి చేశారు. చివ‌రికేమైంది?

ఎన్టీఆర్ ప్ర‌జాజీవితంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఓ సామాన్యుడిలా జ‌నంలో క‌లిసిపోయారు. రోడ్ల‌ప‌క్క‌నే స్నానాలు చేశారు. సాదాసీదా వ్యాన్‌మీదే ఆయ‌న రాష్ట్ర‌మంతా తిరిగారు. ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ అదిరిపోయింద‌ని సిన్మా ఆడ‌దు. రాజ‌కీయ‌మైనా అంతే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి ర‌థం ఇంకా రోడ్డెక్క‌నే లేదు. అప్పుడే వివాదాలు మొద‌ల‌య్యాయి. ఆర్మీ వాహ‌నంలా ఆలివ్‌గ్రీన్ క‌ల‌ర్ వేయ‌డాన్ని మాజీ మంత్రి పేర్నినాని త‌ప్పుప‌ట్టారు. వాహ‌నం రిజిస్ట్రేష‌న్ కూడా జ‌ర‌గ‌ద‌న్నారు. అవునా  పోనీ నేను ఆలీవ్‌గ్రీన్ ష‌ర్ట‌యినా వేసుకోవ‌చ్చా అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేల‌వ‌మైన రియాక్ష‌న్‌. చుట్టూ వందిమాగ‌ధ‌గ‌ణం ఉంటే స‌రిపోదు చ‌టాక్ దిమాక్ కూడా వాడుతుండాల‌ని సారువాడికి ఎవ‌రు చెప్పాలో!