సజ్జల వ్యాఖ్యల మీద రచ్చరచ్చ
మోదీ కుట్ర…కాదు…కేసీఆర్ వ్యూహం అంటూ ఆరోపణలు
పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అనే సామెత వినే ఉంటారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అదే పని చేస్తున్నారు కొందరు నాయకులు. అనేక ఉద్యమాల ఫలితంగా వందలాదిమంది యువకుల ప్రాణత్యాగాల తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. ఎన్డీయే కూడా మద్దతు తెలిపింది. రాష్ట్రం విడిడిపోయి ఎమిదేళ్లవుతోంది. ఇన్నేళ్ల తరువాత రెండు రాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలని ఎవరైనా కోరుకుంటే జనం అతన్ని విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు తిరిగి కలిసిపోవడం అనేది అసంభవం అని చిన్నపిల్లాడికి కూడా తెలుసు. రాష్ట్ర విభజన కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వివాదం మొదలైంది.
ఉండవల్లికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన కౌంటర్‌తో మరింత దుమారం రేగింది.
వీలయితే రెండు రాష్ట్రాలు మల్లీ కలిసిపోవాలన్నదే తమ విధానమని తెలంగాణ, ఏపీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, ప్రభుత్వం ఓటేస్తుందని అన్నారు. సజ్జల వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు. టీఆర్‌ఎస్ కంటే ఎక్కవగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా రియాక్టయ్యారు. సజ్జల వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. సజ్జల మాటల వెనుక కేసీఆర్ ప్రమేయం ఉందని విమర్శించారు. ఏపీ, తెలంగాణ తిరిగి కలిసిపోతే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన ఇది జగన్, కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకం అని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి. మీ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. ఆంధ్రా, తెలంగాణ విభజన అనేది ముగిసిన అంశం. దాన్ని ఇప్పుడు మళ్లీ తెరమీదికి తీసుకొచ్చి ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దు అని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సూచించారు. కవిత లిక్కర్ కేసును పక్కదోవ పట్టించడానికే కేసీఆర్, జగన్ కలిసి నాటకాలాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణ జోలికి రావద్దని సజ్జలను బీజేపీ ఎం.పి అరవింద్ హెచ్చరించారు. సమైక్యాంధ్ర నినాదం వెనకాల సీఎం కేసీఆర్ కుట్ర ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇవన్నీ తెలివి తక్కువ వాదనలు అని కొట్టిపారేశారు. ఇష్టం లేకుండానే తెలంగాణను ఏపీతో కలిపారని 60 ఏళ్ల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. సజ్జల చెప్పినట్లే జరిగితే ఏపీని చెన్నైలో కలపాల్సి వస్తుందని చురకలంటించారు. చరిత్రను వెనక్కి తిప్పడం ఎవరివల్లా కాదని అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విభజన చట్టం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది. తెలంగాణ పల్లెలు పచ్చ బడ్డాయి. హైద్రాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ పచ్చబడటాన్ని చూసి కొందరి కళ్ళు మండుతున్నాయ్. వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ విభజన పై విషం చిమ్మేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల వెనక మోదీ ఉన్నారని ఆరోపించారు. చివరికి షర్మిల కూడా సజ్జల వ్యాఖ్యలను తప్పు పట్టారు. రాష్ట్రాలను కలపడం కాదు మీ ప్రాంతానికి న్యాయం చేయండి. ఏపీ హక్కుల కోసం పోరాడండి అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ, ఏపీ తిరిగి కలవడం అసాధ్యమని సజ్జలకు కూడా తెలుసు. అయినా ఆయన ఇలా మాట్లాడడం మోదీ కుట్ర ఉందని టీఆర్‌ఎస్, కేసీఆర్ కుట్ర ఉందని బీజేపీ ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.