రష్యా చేతికి విక్టర్‌బౌట్.. అమెరికాకి ఏం ఒరిగింది?
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిన్మాకి ఏమాత్రం తీసిపోదా రియల్ సీన్. ఇలా కూడా జరుగుతుందా అన్న ఆశ్చర్యం. ప్రపంచ పెద్దన్న, యూరప్‌నాదనే మొండన్న తలచుకుంటే ఏదైనా సాధ్యమా. ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని రష్యాన్ని తొక్కేయాలనుకుంది అమెరికా. ఇంకా నీ బోడి పెత్తనం నడవదంటూ నెత్తిన అణుబాంబువేస్తానని అందరినీ భయపెడుతోంది రష్యా. ఈ దున్నపోతుల పొట్లాటలో మిగిలిన దేశాలన్నీ ఎప్పుడు నలిగిపోతాయోనని బిక్కుబిక్కుమనే లేగదూడలే. ఇప్పుడు మ్యాటర్ యుద్ధం గురించి కాదు. కరడుగట్టిన నేరస్తుడి అప్పగింత గురించి.
విక్టర్‌బౌట్. ఈ పేరు వింటేనే ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. అతని నిక్‌నేమ్ మర్చంట్ ఆఫ్ డెత్. అంటే మృత్యువ్యాపారి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు ఏ ఆయుధం అవసరమైనా సప్లయ్ చేసేది ఇతగాడే. ఒకప్పుడు సోవియట్ సైన్యంలో పనిచేసిన విక్టర్ యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత ఆయుధ వ్యాపారం స్టార్ట్ చేశాడు. సొంత విమానాల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా ప్రాణాంతక ఆయుధాలను చేరవేస్తుంటాడు విక్టర్‌బౌట్.
అతని హిస్టరీ మీద ఓ హాలీవుడ్ సిన్మా కూడా వచ్చిందంటేనే ఎంత పాపులరో తెలిసిపోతుంది. నానా తిప్పలు పడి విక్టర్ బౌట్‌ని 2008లో అమెరికా అరెస్ట్‌చేసింది. కానీ ఇప్పుడు రష్యాతో డీల్ కుదుర్చుకుని అతన్ని భద్రంగా ఆ దేశానికి అప్పగించేసింది. అంత కష్టపడి పట్టుకున్న ఆయుధవ్యాపారిని రష్యాకి ఇచ్చేయడం వెనుక కీలకమైన అండర్‌స్టాండింగ్ ఉంది. అమెరికన్ ఉమెన్స్ నేషనల్ బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీగ్రినెర్ డ్రగ్స్ కేసులో అరెస్టయి రష్యా జైల్లో ఉంది. లిక్విడ్ గంజాయితో 2022 ఫిబ్రవరిలో మాస్కో ఎయిర్‌పోర్టులో బ్రిట్నీ దొరికింది. ఆమెను విడిపించుకోవడానికి అమెరికా మోస్ట్ డేంజరస్ విక్టర్‌ని అప్పగించింది. విక్టర్‌బౌట్ని వాషింగ్టన్ నుంచి ప్రైవేట్ ఫ్లైట్‌లో అబుదాబి తీసుకొచ్చారు. మరోవైపు మాస్కో నుంచి ప్రైవేట్ జెట్‌లో బ్రిట్నీగ్రినెర్ అక్కడికి చేరుకుంది. ఇంకేముందీ సౌదీ సాక్షిగా ఖైదీల మార్పిడి జరిగిపోయింది. బ్రిట్నీ మళ్లీ బాస్కెట్‌బాల్ ఆడుకోవచ్చు. విక్టర్‌బౌట్ ఏం చేస్తాడో వేరే చెప్పాలా? ఆయుధాలకోసం ఆవురావురు అంటున్న సంఘవిద్రోహశక్తులు, ఉగ్రవాదులు, టెర్రర్ కంట్రీల ఆకలి తీర్చేస్తాడు.