BRS Party: కేసీఆర్‌ మొదటి టార్గెట్‌ కర్నాటక

By KTV Telugu On 9 December, 2022
image

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటి
ప్రకాశ్‌రాజ్‌కు ముఖ్య బాధ్యతలు ఇస్తారని ప్రచారం

బీజేపీ నాయకులు వచ్చె తెలంగాణను టార్గెట్‌ చేసుకుంటే… తెలంగాణ సీఎం కేసీఆర్‌ కర్నాటకపై ఫోకస్‌ పెట్టబోతున్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు చేసిన తరువాత టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌ గా మార్చేందుకు ఆమోదం తెలుపుతూ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆమోదపత్రంపై మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకాలు చేశారు. అనంతరం కొత్తగా రూపొందించిన బీఆర్‌ఎస్‌ జెండాను కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఆ తరువాత జరిగిన విస్తృత స్థాయి సమావేశం లో బీఆర్‌ఎస్‌ తరపున ఇకనుంచి చేపట్టబోయే కార్యక్రమాల గురించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా హాజరయ్యారు. వచ్చే సంవత్సరం కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి ఏడు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ పేరుతో పోటీ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతనికి పైగా ఓట్లు సాధిస్తేనే జాతీయ పార్టీ హోదా వస్తుంది.

అందుకే కర్నాటకలోని ఏడు జిల్లాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆకట్టుకుని ఓట్ల శాతం పెంచుకుందామనేది కేసీఆర్‌ ఆలోచన. ఈ విషయంపై కుమారస్వామితో కేసీఆర్‌ ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. ఇకపోతే నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలాకాలంగా ఆయన కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. రాజకీయాలపై కూడా ఆయనకు ఆసక్తి ఉంది. యాంటి బీజేపీ ఐడియాలజీ ఉన్న ప్రకాశ్‌రాజ్‌ గతంలో బెంగుళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కర్నాటకలో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత అక్కడ ప్రకాశ్‌రాజ్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని అనుకుంటున్నారు. కర్నాటకలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ మీద ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రకాశ్‌రాజ్‌ కూడా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అటు చూస్తే గుజరాత్‌లో బంపర్ మెజారిటీతో గెలిచి ఏడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మంచి ఊపు మీదుంది. మరోవైపు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. ఇక ఇప్పుడే ప్రయాణం మొదలు పెట్టిన బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ ఎలా పరుగులు పెట్టిస్తాడో చూడాలి.