టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది అంతే. అసలు కథంతా ముందుంది

By KTV Telugu On 9 December, 2022
image

70 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్నారు.
ఎర్రకోటపై జెండా ఎగరేస్తానంటున్నారు.
సాధ్యమయ్యే పనేనా.. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి.

ఇళ్లు అలకగానే పండుగ కాదు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడం సాధ్యమయ్యే పనికాదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది అంతే. ఆ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించడమంటే మాటలు కాదు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నంత సులువు కాదు పార్టీని బలపర్చడం. దానికోసం అహోరాత్రులు చెమటోడ్చాల్సి ఉంటుంది. ప్రజల ఆమోదం పొందేందుకు కాళ్లకు బలపం కట్టుకొని తిరగాల్సి ఉంటుంది. కేవలం కుమారస్వామి లాంటి నేతలను పట్టుకొని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారనుకుంటే అది అవివేకమే అవుతుంది. దేశంలో చిన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉంది. రాష్ట్రంలో కేవలం 17 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందులో ప్రస్తుతం కారు పార్టీకి ఉన్న ఎంపీ స్థానాలు 11. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు కేసీఆర్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎర్రకోటపై తాను చెబుతున్నట్టుగా జెండా ఎగరేయడం మాత్రం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. కానీ కేసీఆర్ తలుచుకుంటే సాధ్యమేనంటున్నారు గులాబీ నాయకులు.

దేశంలో ఏనుగులాంటి బీజేపీని ఢీకొట్టాలంటే ఎలుకలా ఉన్న టీఆర్ఎస్ శక్తి ఏమేరకు సరిపోదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనే గులాబీ పార్టీ గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పగలరా. ఏడు పదుల వయసుకు దగ్గరైన ఆయన దేశ రాజకీయాల్లో రాణించాలంటే కత్తిమీద సామే. కేసీఆర్‌కు ఇప్పటివరకు కర్నాటకలో కుమారస్వామి మినహా ఆయనకు మద్దతిచ్చిన పార్టీలేదు. కేవలం రైతులను నమ్ముకొని కేసీఆర్ రాజకీయం చేయగలరా ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేయగలరా అంటే ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం కష్టమే. ఎందుకంటే పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలోనే కేసీఆర్ పార్టీకి స్కోప్ లేదు. ఇక దేశవ్యాప్తంగా ఏవిధంగా ప్రభావం చూపుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని దేశ వ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిలుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. కర్ణాటకలోని పది జిల్లాల్లో పోటీ అంశం పైన క్షేత్ర స్థాయిలో కసరత్తు చేసినట్లు సమాచారం. కర్ణాటకలో కమార స్వామి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కుమారస్వామి సపోర్ట్‌, కర్నాటకలోని తెలుగు ప్రజల ఓట్లు, ప్రకాశ్ రాజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిసొస్తుందనే అంచనాతో గులాబీ పార్టీ ఉన్నట్లు కనబడుతోంది. కానీ కర్ణాటకలో కుమారకు చెప్పుకోదగ్గ బలం, బలగం లేదు. మరి స్వామివారిని నమ్ముకొని కేసీఆర్ సత్తా చాటగలరా? కర్ణాటకలో బీఆర్ఎస్ కాస్తో కూస్తో నిలబడితేనే ఆ తర్వాత ముందుకు వెళ్లేందుకు మార్గం సుగుమమవుతోంది. అక్కడ పల్టీకొడితే మాత్రం పరిణామాలు మరో విధంగా ఉంటాయి.

ఏది ఏమైనా కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు. తెలంగాణ సాధించుకున్న ఉద్యమకారుడు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఏం చేయాలనే విషయంలో పరిజ్ఞానం కూడా ఉంది. ఇవన్నీ మెండుగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటారనే నమ్మకం తెలంగాణ వాదుల్లో కొంత కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారి మరో ప్రస్థానం మొదలుపెట్టబోతున్న కేసీఆర్ అవహేళనలు సాధారణమని అంటున్నారు. అన్ని అవరోధాలను అధిగమించుకొని ముందుకెళ్తామనే భరోసాతో ఉన్నారు. త్వరలోనే ఢిల్లీ కేంద్రంగా పార్టీ కార్యాలయం తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు మాత్రమేనని  రాజకీయ పార్టీలు కాదని కేసీఆర్ చెబుతున్న మాట. ప్రజలను నమ్ముకుంటే వారే ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌ను కేసీఆర్ ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారు? ఆయన వెంట ఇంకా ఎవరైనా నడిచివచ్చే అవకాశముందా? పార్టీ విస్తరణకు సంబంధించి ఆయన దగ్గరున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అనేది మున్ముంది తెలుస్తుంది.