అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిర్లక్ష్యం.
భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై.
మాజీ క్రికెటర్ల విమర్శలు.
భారత క్రికెట్ గాడితప్పుతోందని కామెంట్లు.
ఏమైంది టీమిండియాకి. ఐపీఎల్‌పై ఉన్న మోజు భారత క్రికెటర్లకు అంతర్జాతీయ మ్యాచ్‌ల మీద ఎందుకుండడం లేదు. పొట్టి ఫార్మాట్‌కు అలవాటుపడి పెద్ద మ్యాచ్‌లను ఆడలేకపోతున్నారా? అసలు ఫామ్‌లో లేని ప్లేయర్లను సెలెక్టర్లు ఎందుకు ఆడిస్తున్నారు. సరైన సమయంలో బౌలర్లను ఉపయోగించుకోలేకపోతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇష్టమొచ్చినట్లు మారుస్తున్నారు ఎందుకని. ఇండియన్ క్రికెట్ జట్టు ఓడిపోయిన ప్రతీసారి ఇవే విమర్శలు ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్‌పై భారత్ వన్డే సిరీస్ కోల్పోయిన వైనం ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. ఇలాగైతే కష్టమంటూ అభిమానులు అటు ఆటగాళ్లను, ఇటు సెలెక్టర్లను ఏకిపారేస్తున్నారు. మాజీ క్రికెటర్లు మనోళ్ల పేలవ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు గాడి తప్పిందని కామెంట్లు చేస్తున్నారు.
భారత ఆటగాళ్లపై పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్‌పై ఉన్న ఆసక్తిని అంతర్జాతీయ క్రికెట్‌పై కూడా చూపాలంటూ సెటైర్లు వేశాడు. డబ్బులు ఫ్రాంఛైజీ క్రికెట్లోనే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా సంపాదించుకోవచ్చని ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దేశం కోసం ఆలోచించాలని సూచించాడు. భారత ఆటగాళ్ల మార్పుల విషయంలో నిర్ధిష్టమైన ప్రణాళిక లేదన్న కనేరియా టెస్ట్ సిరీస్ కూడా బంగ్లాదేశ్దేనంటూ జోస్యం చెప్పాడు. భారత క్రికెట్ పడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుత ఆటగాళ్ల ప్రదర్శనపై భారత మాజీ కోచ్ మదన్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చూస్తుంటే అసలు వీరు టీమ్ఇండియా జట్టులోనే ఉన్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. దేశం కోసం ఆడాలన్న మక్కువ, మునుపటి జోష్ లోపించిందని దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే విధానంలో టీమ్ఇండియాలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన తర్వాత తమ క్రికెట్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఇంగ్లాండ్‌ను చూసి భారత్ నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు.
బంగ్లాదేశ్‌పై తొలి వన్డేలో 1 వికెట్ తేడాతో ఓడిన భారత్ రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కీలక సమయాల్లో భారత ఆటగాళ్లు రాణించలేకపోవడం తీవ్ర నిరాశపరుస్తోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ దారుణంగా ఉంది. బంగ్లాదేశ్, టీమ్ఇండియా మధ్య రేపు ఢాకాలో నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది గత ఓటముల నుంచి ఉపశమనం పొందాలని భారత్ భావిస్తుండగా క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాయాలని బంగ్లా ఉవ్విళ్లూరుతోంది.