యాదాద్రి తరహాలో కొండగట్టును అభివృద్ధి చేయాలనుకుంటున్నారా ? ఉత్తర తెలంగాణలో మళ్లీ గులాబీ గుబాళింపుకు కొండగట్టు అంజన్న ఆశీస్సులు అవసరమని కేసీయార్ నిర్ణయానికి వచ్చారా ? ఆ వంద కోట్ల ప్రకటన అందుకేనా ? కేసీఆర్ నిర్ణయం వెనుక ఆయన కూతురు కవిత ఉన్నారా ? ఆమె వేస్తున్న పొలిటికల్ స్కెచ్ ఏమిటి ?
కొండగట్టు అంజన్న ఆలయంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి
ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయింపు
హిందూ సెంటిమెంట్ తో లబ్ధి పొందాలన్న ఆకాంక్ష
గత ఎన్నికల్లో చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం
కవిత, వినోద్ కుమార్ ఓటమితో తెలిసొచ్చిన నిజం
కవిత ఒత్తిడితోనే కొండగట్టుకు నిధుల కేటాయింపు
పనులను స్వయంగా పర్యవేక్షిస్తానంటున్న కేసీఆర్
ఎన్నికల నాటికి ఎన్ని పనులు జరుగుతాయో ?
యాదాద్రిలో సర్వాంగసుందరంగా ఆలయం రెడీ అయ్యింది. పుట్ట పగిలినట్టుగా భక్తులు లక్ష్మీ నర్సింహస్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఇప్పుడు కొండగట్టు వంతు వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే అన్ని దేవాలయాలకు కేసీఆర్ నిధులు ప్రకటించారు. కానీ.. అతిపెద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామికి మాత్రం ఎనిమిదేళ్లుగా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొండగట్టుకు కేసీఆర్ ఆకస్మాత్తుగా వంద కోట్లు ప్రకటించడం భక్తుల్లో ఆనందం, రాజకీయ వర్గాల్లో చర్చకు అవకాశం ఇచ్చింది. కేసీఆర్ తను చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారని కొందరంటున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చేసిన హిందూ గాళ్లూ, బొందూ గాళ్ల కామెంట్స్ టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ సెంటిమెంట్‌తోనే బీజేపీ ఉత్తర తెలంగాణలో మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది. అది కూడా కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు కుడి, ఎడమ భుజాలైన వినోద్‌కుమార్, కవితను ఓడగొట్టడంతో బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది.
వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఇలవేల్పుగా చెప్పాలి. మొక్కులు తీర్చుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు తమ కుటుంబ సభ్యులతో అక్కడకు వెళ్తారు. నిజామాబాద్ నుంచి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్.. బీజేపీ ఎంపీలుగా గెలిచినప్పుడు అంజన్న ఆశీస్సులే తమను విజయ తీరాలకు చేర్చాయని చెప్పుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో హిందూ సెంటిమెంట్ బాగానే పనిచేసింది. దానితో ఓడిపోయిన తర్వాత కల్వకుంట్ల కవిత ఈ దిశగా ఆలోచించారు. బీజేపీ హిందూవాదానికి విరుగుడు సృష్టించాలనుకున్నారు. అందుకే జై హనుమాన్ నినాదాన్ని నెత్తికెత్తుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాయలంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేపట్టారు. అక్కడే శ్రీ రామ కోటి స్తూపం నిర్మించారు. బీజేపీ జై శ్రీరాం అంటే మనం జై హనుమాన్ అనాలని, రామ లక్ష్మణుల జానకి, జై బోలో హనుమాన్‌కీ అంటూ జనంలోకి వెళ్లాలని కార్యకర్తలకు కవిత హిందూ బోధ చేశారు.
కొంటగట్టు భక్తులు మాటలతో పొంగిపోరని టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ చాలా లేటుగా గ్రహించింది. యాదాద్రికి ఇచ్చే నిధులు కొండగట్టుకు ఎందుకివ్వరని స్థానిక గులాబీ నేతలను భక్తులు నిలదీస్తున్నారు. పైగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ దూసుకుపోతోంది. అంజన్న క్షేత్రాన్ని కావాలనే కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ ఆరోపణలు మొదలు పెట్టింది.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి కుడి, ఎడమ వైపు ఉన్న వేములవాడకు, ధర్మపురికి నిధులు కేటాయించిన కేసీఆర్ హనుమాన్ టెంపుల్‌కు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని బీజేపీ నేతలు మౌత్ పబ్లిసిటీ స్పీడ్ పెంచేశారు. అంజన్న ఆశీస్సులు లేకపోవడం వల్లే కవిత, వినోద్ కుమార్ ఓడిపోయారని కూడా గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. దానితో కవిత స్వయంగా రంగంలోకి దిగారు.
కొండగట్టు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేసీఆర్ పై కవిత ఒత్తిడి తెచ్చినట్లు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. గతంలో ప్రకటించిన మాస్టర్ ప్లాన్ దుమ్ము దులపాలని కూడా కవిత అభ్యర్థించారట. దానితో కేసీఆర్ కూడా బాగా ఆలోచించి కొండగట్టుకు వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తన పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేయడంతో పాటు.. పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. మరి అంజన్న క్షేత్రం రూపురేఖలు మారతాయా అంటే ప్రజల్లో అనుమానాలయితే ఉన్నాయి. అన్ని సంక్షేమ పథకాల్లాగే దీన్ని కూడా అటకెక్కిస్తారన్న అనుమానం మూడు జిల్లాల ప్రజల్లో కలుగుతోంది. అవి పటాపంచలు కావాలంటే ఎన్నికల నాటికి సగం పనులైనా పూర్తి కావాలి. యాదాద్రి స్థాయిలో కొండగట్టు ఉంటుందన్న నమ్మకం కలగాలి. మరి ఆ పని జరుగుతుందో లేదో చూడాలి.