రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్
బంగ్లా బౌలర్లను చీల్చిచెండాడిన యువ బ్యాటర్
85 బంతుల్లో శతకం…126 బంతుల్లో ద్విశతకం
బంగ్లాపై మూడో వన్డేలో టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లను చీల్చిచెండాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 85 బంతుల్లో వన్డేల్లో తొలి సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 126 బంతుల్లోనే 23 ఫోర్లు, 9 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు బ్రేక్ చేశాడు. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకున్నాడు. కోహ్లీతో కలిసి భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
వన్డేల్లో టీమిండియా తరుపున అత్యధిక స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషనే. బంగ్లాదేశ్‌లో ఇషాన్ కిషన్‌దే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2011లో షేన్ వాట్సన్ 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు ఇషాన్ కిషన్. బంగ్లాపై అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గానూ ఇషాన్ నిలిచాడు. వన్డేల్లో తొలి సెంచరీ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ కూడా ఇషాన్ మాత్రమే. అంతేకాదు 103 బంతుల్లో 150 దాటిన ఇషాన్ కిషన్ అత్యంత వేగంగా 150+ బాదిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
మొత్తం 131 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు సాధించాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. 138 బంతుల్లో ద్విశతకం బాదిన క్రిస్ గేల్ రికార్డును కూడా ఇషాన్ తిరగరాశాడు. ఇషాన్ ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్‌కు తోడు కోహ్లీ సూపర్ సెంచరీతో భారత్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది.