బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ వ్యూహరచన
జేడీఎస్, రైతుసంఘాలు, స్వచ్చంధ సంస్థలు సరే..
కేసీఆర్‌తో ఆ ఇద్దరూ జత కడతారా?
వామపక్షాలు, ఎంఐఎంతో కలిసి వెళ్తారా?
కేసీఆర్ బీఆర్ఎస్‌కు సపోర్ట్‌గా నిలుస్తోంది ఎవరు? అంటే ప్రస్తుతానికి కర్ణాటక జేడీయూతో పాటు, రైతు సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఓ సినీనటుడు మాత్రమే తెరముందు కనిపిస్తున్నారు. కానీ తెరవెనక చాలా కథే ఉన్నట్టుంది. త్వరలోనే కేసీఆర్‌తో కొన్ని పార్టీలు జతకట్టబోతున్నాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు కేసీఆర్ కమ్యూనిస్టులతో పాటు ఎంఐఎంతో కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తోంది. మొన్న మునుగోడు ఉపఎన్నికలో కామ్రేడ్స్‌ను కారెక్కించుకున్న కేసీఆర్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారిని తమ వెంట తిప్పుకునే ఛాన్స్ ఉందంటున్నారు గులాబీ శ్రేణులు. ఇక ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో దోస్తానం కొనసాగుతుందని ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం గులాబీ పార్టీ ఎలాగూ ఎంఐఎంతో కలిసి నడుస్తోంది. ఆ బంధాన్ని మున్ముందు దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మజ్లిస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంపీ అసద్. ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో ఎంపీతో పాటు రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. పలు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ సీట్లు సాధించారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ లో ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. అయితే అందులో నలుగురు ఆర్జేడీలోకి జంప్ అయ్యారు. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఇక సొంత రాష్ట్రం తెలంగాణలో పతంగి పార్టీwho is కేవలం ఓల్డ్ సిటీకే పరిమితమవుతోంది. మిగతా చోట్ల బలమున్నా ఓట్లు చీలకుండా అసద్ తన మిత్రపక్షమైన కేసీఆర్‌కు సహకరిస్తున్నారనే టాక్ ఉంది. అదేసమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు అసద్ బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారనే ఆరోపణ ఉంది. మరి బీజేపీతో ఢీకొట్టాలనుకుంటున్న కేసీఆర్‌తో కలిసి ఎంఐఎం నడుస్తుందా అనేది చూడాలి.
దేశవ్యాప్తంగా పార్టీని బలపర్చే విషయమై ఇప్పటికే కేసీఆర్ వ్యూహ రచన మొదలుపెట్టారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం కన్నా ప్రస్తుతానికి లోక్ సభ ఎన్నికలవరకే పరిమితమైతే ఎలా ఉంటుంది అనే విషయమై పార్టీ ముఖ్యలతో చర్చిస్తున్నారట. వచ్చే సార్వత్రికఎన్నికల్లో పార్లమెంట్‌లో కొన్ని సీట్లు సాధిస్త ఆ తర్వాత మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టొచ్చనే ఆలోచనతో గులాబీ దళపతి ఉన్నారట. బీఆర్ఎస్‌కు కుమారస్వామి జేడీఎస్, సీపీఎం, సీపీఐ, ఎంఐఎంతోపాటు ఉత్తర భారతదేశంలో మద్దతు పలికేపార్టీలెన్ని? అనేది కొన్నాళ్లకు కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నీ జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్ కు ఆహ్వానం పలికాయి.