కొండ‌ని త‌వ్వి ఎల‌క‌.. ఫాంహౌస్ క‌థ కంచికేనా?

By KTV Telugu On 10 December, 2022
image

ఆళ్లొస్తున్నార‌ట‌.. అరెస్ట్ చేసే ద‌మ్ముందా?

మొయినాబాద్ ఫాంహౌస్ స్టింగ్ ఆప‌రేష‌న్‌. బీజేపీ అడ్డంగా బుక్ అయిపోయింద‌ని గులాబీపార్టీ చంక‌లు గుద్దుకుంది. ఇక్క‌డ‌లాగితే ఢిల్లీదాకా డొంక క‌దులుతుంద‌ని అంచ‌నాలేసుకుంది. కానీ ఏమైంది? ముగ్గురిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కి పంపామ‌న్న తుత్తి త‌ప్ప కేసులో ఏ పురోగ‌తీ లేదు. స్పాట్‌లో ప‌ట్టుకున్న‌ ముగ్గురు త‌ప్ప మిగిలిన‌వారిని నిందితులుగా చేర్చేందుకు కూడా కోర్టు ఒప్పుకోలేదు. అస‌ల‌క్క‌డ ఏమ‌న్నా దొరికితే క‌దా. ఆడియో సంభాష‌ణ‌లు త‌ప్ప మ‌రో ఎవిడెన్సేమీ లేని కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలో సిట్‌కి అర్ధంకావ‌డం లేదు. ముగ్గురికీ బెయిల్ దొరికినా అందులో ఇద్ద‌రిని వేరే కేసుల్లో మ‌ళ్లీ జైలుకు పంప‌డం త‌ప్ప కేసులో పురోగ‌తి మాత్రం లేదు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జ‌రిగిన బేర‌సారాల్లో ప్ర‌ధానంగా వినిపించిన పేరు బీఎల్ సంతోష్‌. ఆయ‌న బీజేపీ జాతీయ నేత‌. కేంద్ర పెద్ద‌ల‌కు బాగా కావాల్సిన‌వాడు. పోలీసులు అరెస్ట్‌చేసిన ముగ్గురు నిందితుల‌తో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడారు. కాల్‌డేటా ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ సిట్ నోటీసులిచ్చినా సంతోష్ విచార‌ణ‌కు రాలేదు. సంతోష్‌ని అరెస్ట్‌చేయొద్ద‌ని ఆదేశించిన కోర్టు నోటీసుల‌పై స్టే ఇచ్చింది. బీఎల్ సంతోష్‌ని అరెస్ట్ చేస్తే బీజేపీని ఓ ఆట ఆడించ‌వ‌చ్చ‌న్న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేలా లేదు.

ఢిల్లీలో బీఎల్ సంతోష్‌కి నోటీసులిచ్చేందుకు అక్క‌డి పోలీసుల సాయం తీసుకున్నారు. అంత పెద్ద త‌ల‌కాయ‌ని కోర్టు బోనులో నిల‌బెట్ట‌డం అంత ఆషామాషీ కాద‌న్న విష‌యం పోలీసుల‌కు తెలుసు. దీంతో ఫాంహౌస్ కేసు కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన‌ట్లు అయింది. పుండుమీద కారంచ‌ల్లిన‌ట్లు కేసీఆర్ అండ్‌కోకి ఇప్పుడింకో ఇరిటేష‌న్‌. ఎందుకంటే డిసెంబరులో బీఎల్ సంతోష్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా హైద‌రాబాద్ వ‌స్తున్నారు. 28, 29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల శిక్షణ సమావేశానికి వీరు హాజ‌రవుతుండ‌టం సిట్ అధికారులకు తలనొప్పిగా తయారైంది.

ఫాంహౌస్ కేసు నిందితుల‌కు బీఎల్ సంతోష్‌తో సంబంధాలున్నాయి. ఫోన్ సంభాష‌ణలు న‌డిచాయి. కానీ ఈ కార‌ణంతో బీఎల్ సంతోష్ ఫ్ల‌యిట్ దిగ‌గానే అరెస్ట్ చేయ‌డం సాధ్యంకాదు. సిట్ స‌మ‌ర్పించిన ఆధారాల‌తో కోర్టు సంతృప్తిగా లేదు. స్టేతో సిట్ ముంద‌రికాళ్ల‌కు బంధం వేసిన‌ట్ల‌యింది. దీంతో బీఎల్ సంతోష్ హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్లిపోయినా ఏమీ చేయ‌లేక‌పోవ‌డం కేసీఆర్ ప్ర‌భుత్వానికి అవ‌మాన‌మే. అందుకే ఆ లోపు న్యాయ‌ప‌రంగా అనుమ‌తి తెచ్చుకుంటే త‌ప్ప సిట్ ఓ అడుగుకూడా ముందుకేసే అవ‌కాశం లేదు. ఎమ్మెల్యేల‌తో బేరాలాడిన బృందానికి పెద్ద త‌ల‌కాయ అయిన సంతోష్‌ని సిట్ ట‌చ్ చేయ‌గ‌ల‌దా? ద‌ర్జాగా వ‌చ్చి వెళ్లిపోతే ఇంత ఎపిసోడ్ న‌డిపిన కేసీఆర్ స‌ర్కారు త‌ల‌కాయ ఎక్క‌డ పెట్టుకుంటుంది?