తెలంగాణ రాజకీయాల్లో బూతులే విమర్శలా ? ఇక మారరా ?

By KTV Telugu On 13 May, 2022
image

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు అంటే బూతులు అనే స్థాయికి దిగజారాయి. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎవరైనా సరే… మైక్ అందుకుంటే అసువుగా బూతులొచ్చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇవ్వకపోతే తాము అలుసైపోతామని అధికార పార్టీ కూడా భావిస్తోంది. దానికి రెండింతల బూతుల ప్రయోగం చేస్తోంది. దీంతో ఇది అంతకంతకూ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఇదో భాషా కాలుష్యంలా మారిపోయింది. గత రెండు, మూడు రోజులుగా బండి సంజయ్, కేటీఆర్, రేవంత్ రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ నేతల భాషా పటిమ కూడా అదే స్థాయిలో ఉంది.

నోళ్లు అందరికీ ఉంటాయని ఎందుకు తెలుసుకోరు ?

” నువ్ పనికి మాలిన వాడివి ” అని ఎవరినైనా అని చూడండి. అతను మళ్లీ అంత కంటే రెండు మాటలు ఎక్కువే అంటాడు. అంటే అన్న వాడితో పాటు మాట పడినవాడూ అదే భాష వాడతాడు. ఒక వేళ వాడకపోతే వాడిని చేతకాని వాడిగా జత కట్టేస్తారు పక్కన వాళ్లు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. రాజకీయాల్లో అసలు అనుకోరు. ఒకరు తమలపాకుతో ఒకటి అంటే మరొకరు తలుపుచెక్కతో రెండు అంటారు. అది అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఎక్కడా అంతం ఉండదు. ప్రస్తుతం ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కనిపిస్తోంది. ఏపీలో ఆ పరిస్థితి ఎప్పుడో దిగజారిపోయింది. ఎంత దిగజారిపోయిందంటే.. ఇక అలా తిడితే ఆత్మాహుతి దాడులు చేస్తామని టీడీపీ నేతలు బెదిరించే స్థాయికి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే స్థాయిలో వస్తంది.

ప్రత్యర్థిని ఓడించడం అంటే తిట్టడం కొట్టడం కాదు..!

” ఇంత కన్నా దిగజారడానికి ఏమీ లేదు అనుకున్న ప్రతీ సారి ఇంకా ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి “ఓ సినిమాలో డైలాగ్‌. ప్రస్తుత రాజకీయ భాషకు అన్వయించుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే భావన కలుగుతుంది.రాజకీయంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజలను మెప్పించాలి. ప్రత్యర్థి కన్నా తను గొప్ప అని ప్రజలకు నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకుని గెలవాలి. అది గెలుపు. అంతే కానీ ప్రత్యర్థిని బండబూతులు తిట్టేసి వీలైతే కొట్టేస్తానని బెదిరించి.. చచ్చిపో అని శాపనార్ధాలు పెట్టి అతన్ని మానసికంగా వేధిస్తున్నా అని సంబర పడిపోవడం రాజకీయం కాదు. ప్రతి రాజకీయ నేత…ఎంత రాజకీయప్రత్యర్థి అయినా సంబోధించేటప్పుడు గారు అనే సంభోధిస్తారు. కానీ ఇప్పుడు అది గాడు అయిపోయింది. లైక్ మైండెడ్ పీపుల్ అహో.. ఒహో అంటారేమో కానీ సభ్యత సంస్కారం ఉన్న వారెవరూ హర్షించరు. ఇప్పుడు రాజకీయ విమర్శలు అనడం కన్నా రాజకీయ బూతులు అని చెప్పడం కరెక్ట్.

కేసీఆరే నేర్పారని కారణం చెబుతున్న నేతలు !

గతంలో కేసీఆర్ మాత్రమే ఆ భాష వాడేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన భాష ఆయనకు ఓ ఆయుధం. ఇప్పుడు ఆయన దగ్గర్నుంచి అందరూ వంటబట్టించుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్ సహా అందరూ అదే భాష వాడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాకు నేర్పింది కేసీఆరే అనడం ప్రారంభించారు. కేసీఆర్ ట్రేడ్‌ మార్క్ విమర్శ సన్నాసి. గతంలో ఆ మాట అనేవారు. ఇప్పుడు అందరూ అందర్నీ అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ తిట్ల భాష ఎక్కువనే ఉంది. ఓ రకంగా అదొక్కటే ఉంది. ముందు ముందు మరింత మంది అదే బాటలో పయనించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే జరిగితే రాజకీయం అంటేనే ప్రజలు అసహ్యించుకుంటారు. రాజకీయ నేతలంటే విలువ లేకుండా పోతుంది.

మార్చాల్సింది నేతలే !

రాజకీయాలు ప్రజల కోసమే చేస్తారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే కానీ శత్రువులు ఉండరు. ఈ విషయాన్ని రాజకీయ నేతలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ గీత దాటిపోయి వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి రాజకీయాలను తిట్ల ద్వారా తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితులపై ఆలోచించాల్సింది నేతలే. ఒకరు ఆపేస్తే.. మిగతా వారు ఆపేస్తే.. ఒకరు తిడితే మరొకరు తిడతారు. ఈ చైన్ వాళ్లే ఆపాలి. ప్రజలకు కాస్త గౌరవనీయ రాజకీయాలు అందించాలి.