కాంగ్రెస్‌ను పల్లెత్తు మాట అనొద్దని వైఎస్ఆర్, తాను ఒట్టు వేసుకున్నాం
వైఎస్ ఆత్మ కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు. జగన్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తి
జగన్ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్సార్ ఆత్మబంధువు కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోందంటూ అసంతృప్తి వెలిబుచ్చారు. విభజన హామీలపై జగన్ పోరాడడం లేదని ఎంతో భవిష్యత్తు ఉన్న ఏపీలో ప్రస్తుత పాలన సరైన దిశలో సాగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం దుస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వం సరైన విధానంలో వెళ్లడం లేదని కేవీపీ చెప్పుకొచ్చారు. పోలవరం కేంద్రమే నిర్మించాలని చట్టంలో ఉన్నా ప్రత్యేక ప్యాకేజీ కోసం బాబు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్దపడినా అడ్డుకొనే ప్రయత్నాలు జరగకపోవడం బాధాకరమన్నారు కేవీపీ.
వైఎస్సార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌రెడ్డికి, తనకు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చిందని. 1978 నుంచి అనేక పదవులు కట్టబెట్టిందని కేవీపీ వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీని వీడకూడదని, ఏనాడూ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదనేది తమ విధానంగా ఉండేదన్నారు. పార్టీ అధినాయకత్వాన్ని పల్లెత్తుమాట అనకూడదని 1996లోనే రాజశేఖర్‌రెడ్డి, తానూ ఒట్టేసుకున్నామని కేవీపీ చెప్పారు. చివరిదాకా కాంగ్రె్‌సతోనే ఉంటానని కేవీపీ రామచంద్రరావు పార్టీ స్పష్టం చేసారు. నాడు వైఎస్సార్ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని గుర్తు చేసారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటంతో పాటు రాహుల్‌ను ప్రధాని చేయాలని వైఎస్ఆర్ అనుకున్నారని కేవీపీ తెలిపారు.
ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిపై తనదైన విశ్లేషణ ఇచ్చారు కేవీపీ. భవిష్యత్ లేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే 2024 లో కాకపోయినా 2029 నాటికికైనా కాంగ్రెస్ తన సత్తా చాటుతుందన్నారు ఆయన. నేతలంతా ఐక్యంగా ముందుకు సాగితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆ ఫ్యామిలీకి దూరమైన కేవీపీ కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు సీఎంను కలిసింది లేదు. ఇక హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ వర్దంతి సందర్భంగా విజయమ్మ నిర్వహించన సదస్సులో ఓసారి పాల్గొన్నారు. అయితే ఎప్పుడూ లేనివిధంగా జగన్ పాలనపై కేవీపీ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.