కవితను ఒక గదిలో ప్రశ్నిస్తున్న అదుగురు సభ్యుల బృందం
సీబీఐ విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలన్న నారాయణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో 11మంది అధికారుల బృందం కవిత ఇంటికి వచ్చారు. ఇందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. కవిత ఇంట్లోని ఒక గదిలో అయిదుగురు అధికారుల బృందం ఆమె వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. కవిత అడ్వొకేట్లు ఉదయం పదిన్నరకే ఆమె ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ అడ్వొకేట్ల సమక్షంలోనే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అమిత్ అరోరా స్టేట్మెంట్ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు రాత్రికిరాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీబీఐ విచారణ సందర్భంగా కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్లే మార్గాన్ని రెండువైపులా పోలీసులు క్లోజ్ చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు విచారణ కొనసాగవచ్చని సమాచారం. బీజేపీ కావాలనే సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్ష సాధిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీబీఐ వాళ్లు చాయ్ బిస్కట్ తినడానికి రాలేదు తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలు జైలుకు పోవాల్సిందే అన్నారు. మరోవైపు సీబీఐ దర్యాప్తును లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ నారాయణ.
అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతున్నారో కవిత ఏం సమాధానం చెబుతుందో ప్రజలు చూడాలని అన్నారు. న్యాయస్థానాల్లో జరుగుతున్న కేసు విచారణలు లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే సీబీఐ విచారణను ఎందుకు లైవ్ పెట్టరు అని ఆయన డిమాండ్ చేశారు. కవిత వాంగ్మూలం నమోదు చేసుకున్నాక సీబీఐ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది.