కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి.
జేడీఎస్‌తో కలిసి బరిలోకి బీఆర్ఎస్.
జగన్ పార్టీకూడా పోటీ చేస్తుందనే టాక్.
కుమార-కేసీఆర్, కాంగ్రెస్‌కు పోటీగా.
బీజేపీ వైసీపీని దించనుందని పుకార్లు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది కన్నడనాట జరగనున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నాయకులు కీలక పాత్ర పోషించబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే, అక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పోటీకి సిద్ధమవుతోంది. కుమారస్వామి జేడీఎస్‌తో కలిసి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రణాళిక రచిస్తోంది. అయితే ఏపీలోని జగన్ వైఎస్సార్సీపీ కూడా కర్ణాటకలో పోటీ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పోటీకి వ్యూహరచన చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీయే జగన్‌ను కర్ణాటకకు పంపించేందుకు ఎత్తుగడ వేస్తోందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే స్వరాష్ట్రం కర్నాటక. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఖర్గే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారనే విశ్వాసం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ ఆపరేషన్‌తో సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. అయితే ఇప్పుడు కుమార స్వామి పార్టీ కేసీఆర్‌తో జతకట్టనుండడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది.
వచ్చే ఏడాది మే నాటికి కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికోసం అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతా దళ్ సమాయాత్తమౌతున్నాయి. త్వరలోనే బెంగళూరులో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. మరోసారి ఎలాగైనా అధికారం చేపట్టాలనుకుంటున్న బీజేపీకి ఇక్కడ మారిన రాజకీయం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు కేసీఆర్, కుమారస్వామి మరోవైపు ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ కాషాయ పార్టీని ఢీకొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఓట్లు చీల్చేందుకు బీజేపీ జగన్ పార్టీని రంగంలోకి దింపుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలుగు వారు స్థిరపడిన జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థులను నిలబెడుతుందని చెబుతున్నారు. అందుకోసం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సహకారాన్ని వైఎస్ జగన్ తీసుకుంటారనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో జైలు నుంచి విడుదలైన తరువాత గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన సహకారంతో జగన్ కర్ణాటకలో పోటీకి ప్లాన్ చేస్తున్నారట. బీజేపీయే వారిని తెరవెనక నుండి నడిపించాలనుకుంటుందనే రూమర్లు వస్తున్నాయి. బళ్లారితో పాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరుకు ఆనుకుని ఉన్న రాయచూరు, చిక్‌బళ్లాపుర, కోలార్ జిల్లాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో జగన్ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. కనీసం 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేలా వైఎస్ఆర్సీపీ వ్యూహాలను రూపొందించుకుంటోందని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ-గాలి జనార్ధన్ రెడ్డి మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగాయని చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ మంత్రి ఒకరు గాలి జనార్ధన్ రెడ్డితో మాట్లాడారని సమాచారం. కర్ణాటక రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల ఆయనకు ఈ బాధ్యతను అప్పగించారని చెబుతున్నారు.